2,000 నోటు ఇక కనుమరుగే..! | RBI has stopped printing Rs 2,000 notes | Sakshi
Sakshi News home page

2,000 నోటు ఇక కనుమరుగే..!

Published Thu, Feb 27 2020 4:37 AM | Last Updated on Thu, Feb 27 2020 8:17 AM

RBI has stopped printing Rs 2,000 notes - Sakshi

న్యూఢిల్లీ:  బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువగా రూ.2,000కు బదులు రూ.500 నోట్లే ఉంచుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధిక విలువ కరెన్సీ నోట్లను క్రమంగా వెనక్కు తీసుకోడానికి ఇది సంకేతమనీ ఆ వర్గాలు సూచిస్తున్నాయి. సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు గత ఏడాది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సమాధానం ఇస్తూ, రూ.2,000 నోట్ల ప్రింటింగ్‌ను నిలుపు చేసినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..
     
► ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు ఏవీ లేనప్పటికీ, బ్యాంకులు తమకు తాముగా తమ ఏటీఎంలను తక్కువ విలువగల నోట్లతో నింపుతున్నాయి.  

► ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ ఇప్పటికే ఒక ప్రకటన చేస్తూ, తమ ఏటీఎంల్లో రూ.2,000 నోట్ల వినియోగాన్ని నిలుపుచేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.  

► నిజానికి రూ.2,000 నోట్లను ఏటీఎంల్లో నింపడానికి వాటిని కొంత అప్‌గ్రేడ్‌ చేయాల్సిన పరిస్థితి. ఈ వ్యవహారం వ్యయాలపరంగా బ్యాంకింగ్‌పై అదనపు భారాన్ని మోపుతోంది. ఈ అంశం కూడా బ్యాంకులు రూ.2,000 నోట్లను ఏటీఎంలలో పెట్టడానికి కొంత వెనక్కుతగ్గేలా చేస్తోంది.  

► సమాచార హక్కు చట్టం ప్రకారం, ఆర్‌బీఐ ఇచ్చిన సమాధానాన్ని చూస్తే, రూ.2,000కు సంబంధించి 2016–17లో 3,542.991 మిలియన్‌ నోట్లను ముద్రించడం జరిగింది. 2017–18లో ఈ సంఖ్య 111.507కు పడిపోయింది. 2018–19లో ఇది మరింతగా 46.690 మిలియన్‌ నోట్లకు తగ్గింది. దీని ప్రకారం చూస్తే రూ.2,000 నోటును ఆర్‌బీఐ క్రమంగా వెనక్కు తీసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.  

► అధిక విలువ కలిగిన నోట్ల అక్రమ నిల్వ, నల్లధనం నిరోధం లక్ష్యంగా రూ.2,000 నోటును వ్యవస్థ నుంచి క్రమంగా తగ్గిస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయి.  

► 2016  నవంబర్‌లో కేంద్రం రూ.1,000, రూ.500 విలువ నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే.  

► రూ.2,000 నోటును ఉపసంహరించే ప్రతిపాదనఏదీ ప్రభుత్వం వద్ద లేదని గత ఏడాది డిసెంబర్‌లో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, చెలామణీలో ఉన్న నోట్ల (ఎన్‌ఐసీ) విలువ 2016 నవంబర్‌ 4న రూ.17,74,187 కోట్లు.  2019 డిసెంబర్‌ 2 నాటికి ఈ విలువ రూ.22,35,648 కోట్లకు పెరిగింది.  

► వార్షిక ప్రాతిపదికన చూస్తే, 2014 అక్టోబర్‌ నుంచి 2016 అక్టోబర్‌ మధ్య చెలామణీలో ఉన్న నోట్ల విలువ  సగటున 14.51 శాతం పెరిగింది. ఈ లెక్కన చూస్తే, 2019 డిసెంబర్‌ 2 నాటికి ఎన్‌ఐసీ రూ.25,40,253 కోట్లకు చేరి ఉండవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement