ముంబై: దేశంలో రూ. 2,000 నోట్లను 2019–20 ఆర్థిక సంవత్సరంలో అసలు ముద్రించనే లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వార్షిక నివేదిక తెలిపింది. గత కొద్ది సంవత్సరాలుగా అసలు ఈ నోట్ల సర్క్యులేషన్ కూడా తగ్గుతూ వస్తోందని నివేదిక పేర్కొంది. బ్యాంకింగ్ మోసాలు రెట్టింపు, ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 ప్రభావం, వ్యవస్థలో డిమాండ్, దేశాభివృద్ధి వంటి కీలక అంశాలను 2019–20 వార్షిక నివేదిక చర్చించింది. ఆయా అంశాలను పరిశీలిస్తే...
రూ. 500, రూ. 200 కరెన్సీ నోట్ల ప్రవాహం
2019 మార్చి చివరినాటికి చెలామణీలో ఉన్న రూ.2,000 కరెన్సీ నోట్ల సంఖ్య 33,632 లక్షలు. 2019 మార్చి నాటికి ఈ సంఖ్య 32,910 లక్షలకు తగ్గింది. 2020 మార్చి నాటికి మరింతగా 27,398 లక్షలకు పడిపోయింది. 2020 మార్చి చివరినాటికి మొత్తం నోట్ల పరిమాణంలో రూ.2,000 నోట్లు 2.4 శాతంగా ఉంది. 2018 మార్చి ముగిసేనాటికి ఇది 3.3 శాతం ఉంటే, 2019 మార్చి నాటికి 3 శాతానికి దిగివచ్చింది. ఇక విలువలు చూస్తే, మొత్తం నోట్ల విలువలో వీటి వాటా 2018 మార్చి నాటికి 37.3 శాతం. 2019 మార్చి నాటికి 31.2 శాతానికి దిగివచ్చింది. 2020 మార్చి నాటికి మరింతగా 22.6 శాతానికి తగ్గిపోయింది.
ఇదే సమయంలో రూ.500, రూ.200 నోట్ల కరెన్సీ నోట్ల చెలామణీ అటు విలువ పరంగా ఇటు సర్క్యులేషన్ పరంగా భారీగా పెరిగింది. బ్యాంక్ నోట్ల ఇండెంట్ కూడా గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో 23.3 శాతం నుంచి 13.1 శాతానికి తగ్గింది. ఇక నకిలీ కరెన్సీ నోట్ల విషయానికి వస్తే, ఇలా గుర్తించిన మొత్తంలో 4.6 శాతాన్ని ఆర్‌బీఐ గుర్తించగా, 95.4 శాతాన్ని ఇతర బ్యాంకులు పసిగట్టాయి. గుర్తించిన మొత్తం నకిలీ నోట్ల సంఖ్య 2,96,695. 2018–19లో గుర్తించిన రూ.2,000 నకిలీ నోట్ల సంఖ్య 21,847 అయితే 2019–20లో ఈ సంఖ్య 17,020కి తగ్గింది. నిగనిగలడే రూ.100 బ్యాంక్‌నోట్లను ట్రైల్ బేస్‌లో తీసుకురావడానికి పలు చొరవలు ప్రారంభమయ్యాయి. అయితే కోవిడ్–19, ఇతర కొన్ని కారణాలతో ముద్రణాప్రక్రియ నిలిచిపోయింది.
మెరుగుపడుతున్న వడ్డీరేట్ల బదలాయింపు
సరళతర ద్రవ్య పరపతి విధానంలో (ఎంపీసీ) భాగంగా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం)ను 2019 ఫిబ్రవరి నుంచీ ఆర్‌బీఐ 250 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తమకు అందివచ్చిన ఈ ప్రయోజనాన్ని బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించడం 2019–20లో మెరుగుపడింది. ప్రత్యేకించి ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగంలో బదలాయింపుల ప్రక్రియ ఊపందుకుంది. 2019 అక్టోబర్ నుంచి జూన్ 2020 మధ్య బ్యాంకింగ్ గృహ రుణాలపై వడ్డీరేట్లు 104 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గాయి. వాహన రుణాలపై ఈ తగ్గింపు 102 బేసిస్ పాయింట్లు ఉంటే, వ్యక్తిగత రుణాల విషయంలో 115 బేసిస్ పాయింట్లు ఉంది.
ఇక లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల విషయంలో 198 బేసిస్ పాయింట్ల రుణ రేటు తగ్గింది. మరింతగా వడ్డీరేట్ల తగ్గింపునకు తగిన చర్యలను ఆర్‌బీఐ తీసుకుంటుంది. తగిన తక్కువ వడ్డీరేట్లకు రుణాలు అందడం వల్ల పెట్టుబడులు, డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. 2018–19లో బ్యాంకింగ్ రుణ వృద్ధి రేటు 13.3 శాతం ఉంటే, 2019–20లో ఇది 6.1 శాతానికి తగ్గడం ఆందోళనకరం. ప్రస్తుత కోవిడ్–19 పరిస్థితుల నేపథ్యం రుణ వృద్ధిరేటుపై మరింత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో దాదాపు ఈ పరిస్థితి కనబడుతోంది. వ్యవస్థలో డిమాండ్, తద్వారా వృద్ధి పురోభివృద్ధికిగాను తగ్గిన రుణరేట్ల ప్రయోజనం కస్టమర్‌కు అందాలి.
ఆహారోత్పత్తుల మిగులు నిర్వహణ సవాళ్లు
ఆహారోత్పత్తుల మిగులు నిర్వహణ విషయంలో సవాళ్ల మధ్య ప్రస్తుతం భారత్ నిలబడింది. 2019–20లో భారత్ మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 296.65 మిలియన్ టన్నుల రికార్డు స్థాయికి చేరింది. ఇక ఉద్యానవన ఉత్పత్తులు ఆల్‌టైమ్ హై 320.48 మిలియన్ టన్నులకు ఎగసింది. పాలు, తృణధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు, పత్తి, చెరకు, మత్స్య, పౌల్ట్రీ వంటి రంగాల ఉత్పత్తి విషయంలో ముందు వరుసలో ఉన్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోంది. అయితే ఆహార భద్రత, మిగులు నిర్వహణ విషయం లో భారత్ సవాళ్లను ఎదుర్కొంటోంది.
సెప్టెంబర్ 3నాటికి రూ.20 వేల కోట్లు
వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) తగినంత ఉండడానికి ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుంది. సెప్టెంబర్ 3 నాటికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా నిర్వహించనున్న రెండు దశల బాండ్ల కొనుగోలు ప్రక్రియతో వ్యవస్థలోకి రూ.20,000 కోట్లను పంప్ చేయాలన్న నిర్ణయం జరిగింది. ఆగస్టు 27న రూ.10,000 కోట్లకు బాండ్ల వేలం నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 3న మరో దశ వేల ప్రకటన ఉంటుంది. వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు ఎటువంటి సమస్యా లేకుండా ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటోంది.
వ్యవసాయం... వాతావరణ మార్పులపై జాగ్రత్త
మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 15 శాతం వాటా కలిగిన భారత వ్యవసాయ రంగంపై వాతావరణ మార్పు ప్రభావం పడే ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. వర్షపాతంలో ఒడిదుడుకులు, ఉష్ణోగ్రత పెరగడం వంటి అంశాలు వ్యవసాయ ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. కొన్ని ప్రతికూలతలు ఉన్నా గడచిన గడచిన ఆర్థిక సంవత్సరం ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం చేయూతను ఇచ్చింది. 2020లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 1901 నుంచి 2000 మధ్య భారత్‌లో వార్షిక సగటు ఉష్ణోగ్రత 0.5 సెల్సియస్ పెరిగితే, 1997–2019 మధ్య ఇది 1.8 సెల్సియస్‌కు చేరడం ఒకింత ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి పరిస్థితి కొనసాగితే, పంట దిగుబడులు, వ్యవసాయ ఆదాయాలు పడిపోయే ప్రమాదం ఉంది. ఆయా పరిస్థితులను అధిగమించడానికి తగిన పటిష్ట చర్యలు అవసరం.
పెరగనున్న ధరల స్పీడ్
ఆహారం, తయారీ వస్తువుల సరఫరాల్లో ఇబ్బందుల వల్ల వచ్చే కొద్ది నెలల కాలంలో ధరలు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. 2019–20 చివరి నెలల్లో పెరుగుతూ వచ్చిన ద్రవ్యోల్బణం 2020–21 తొలి ఆరు నెలల్లోనే నిర్దేశిత స్థాయిలను దాటింది. ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులూ ఇందుకు కారణం. కూరగాయలు, పప్పు దినుసులు, చేపలు, మాంసం వంటి ఆహార ధరలు పెరుగుదల వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 6.93%కి పెరిగింది. పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 4% (2 శాతం అటూఇటుగా) స్థాయిలో ఉండాలనేది ఆర్‌బీఐకి ప్రభుత్వ నిర్దేశం.
జనవరి నుంచి ఎకానమీ వృద్ధిబాట!
భారత్ ఆర్థిక వ్యవస్థలపై కరోనా వైరస్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందన్న విషయంపై కచ్చితమై నిర్ధారణకు రావడం కష్టం. లాక్‌డౌన్, వినియోగ డిమాండ్ పడిపోవడం, అంతర్జాతీయ అంశాలు వంటి పరిశీలించాల్సిన అపరిష్కృత అంశాలు ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– జూన్ మధ్య ఆర్థిక వ్యవస్థ క్షీణతలోకి జారిపోతుందని భావిస్తున్నాం. డిసెంబర్ వరకూ రికవరీ దశ ఉండే వీలుంది. చివరి త్రైమాసికం (జనవరి–మార్చి) నుంచి ఆర్థిక రంగం వృద్ధిబాటలోకి వెళ్లే అవకాశం ఉంది. ప్రైవేటు వినియోగం ప్రస్తుతం పూర్తిగా పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యయాలు, ప్రత్యేకించి మౌలిక రంగంపై ప్రత్యేక దృష్టి అవసరం. ఆయా చర్యలు డిమాండ్ రికవరీకి ఊతం ఇస్తాయి. ఇక సుస్థిర వృద్ధి రేటుకు ప్రొడక్ట్ మార్కెట్లు, ఫైనాన్షియల్, కార్మిక రంగాల్లో విస్తృత శ్రేణి సంస్కరణలు తీసుకురావాలి. అదే సమయంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాల మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు కట్టుతప్పకుండా తగిన చర్యలు ఉండాలి.
బ్యాంకింగ్ మోసాలు రెట్టింపు
బ్యాంకింగ్ మోసాలు రెట్టింపుకావడం తీవ్ర ఆందోళనకరమైన అంశం. 2018–19లో రూ.71,500 కోట్ల బ్యాంకింగ్ మోసాలు జరిగితే, అటు తర్వాత 2020 జూన్ నాటికి ఈ మొత్తం రూ.1.85 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. అటు వాసిలోనూ ఇటు రాసిలోనూ రెండింటిలో మోసాలు తీవ్రం అయ్యాయి. ఫ్రాడ్ కేసులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వార్షికంగా 234 శాతం పెరిగితే, ప్రైవేటు బ్యాంకుల్లో ఈ పరిమాణం 500 శాతంపైగా ఉండడం గమనార్హం. ‘‘ముందస్తు హెచ్చరికల సంకేతాలు’’ వ్యవస్థ బలహీనత, అంతర్గత ఆడిట్ల విషయంలో లోపాలు, ఫోరెన్సిక్ ఆడిట్ల సమయంలో అందని రుణ గ్రహీతల సహకారం, అసమగ్ర ఆడిట్ నివేదికలు, నిర్ణయాల విషయంలో బ్యాంకింగ్ మధ్య సమన్వయ లోపాలు, మోసాలను గుర్తించడంలో జరుగుతున్న ఆలస్యం’’ వంటి అంశాలు ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆయా లోపాల పట్ల బోర్డులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment