త్వరలో తిరిగి వచ్చిన నోట్ల లెక్కలు: ఆర్‌బీఐ
ముంబై: బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో డిపాజిట్ అయిన పాత నోట్ల సంఖ్యను తిరిగి సరిచూసుకుని సంబంధిత మొత్తం గణాంకాలను త్వరలో ప్రకటిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం తెలిపింది. నోట్ల డిపాజిట్‌పై వివిధ ఊహాగానాలు, వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా వివరణ ఇచ్చింది. డిసెంబర్ 30 నాటికే రద్దయిన నోట్లలో 95 శాతం మేర వెనక్కు వచ్చేశాయని ఊహాగానాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.
‘‘రద్దయిన నోట్ల డిపాజిట్లపై పలు అంచనాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇందుకు సంబంధించి వివిధ కరెన్సీ చెస్ట్‌లలో ఉన్న నోట్ల లెక్కను తిరిగి సరిచూసుకుని తగిన గణాంకాలను త్వరలో విడుదల చేస్తాం’’ అని ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది. ఈ ప్రక్రియను ఇప్పటికే ఆర్‌బీఐ ప్రారంభించిందనీ ప్రకటన పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిస్తామనీ తెలిపింది.