న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన సమీక్షలో యథాతథస్థితిని కొనసాగించే అవకాశం ఉందని ఎక్కువ మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకపక్క ఆర్థిక వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం శాంతించినప్పటికీ... ఈ నెల 5న ప్రకటించనున్న పాలసీ నిర్ణయంలో కీలక రేట్లలో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చని వారు భావిస్తున్నారు. వరుసగా రెండు పాలసీల్లో రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ గత సమీక్ష(అక్టోబర్)లో మాత్రం రేట్లను పెంచకుండా అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. డాలరుతో రూపాయి మారకం విలువ పాతాళానికి పడిపోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భగ్గుమనడంతో అక్టోబర్‌లో బ్యాంకర్లు, నిపుణులు ఆర్‌బీఐ రెపో రేటును పెంచొచ్చని అంచనా వేశారు.
అయితే, దీనికి భిన్నంగా ఆర్‌బీఐ వ్యవహరించడం గమనార్హం. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల 3 నుంచి 5 వరకూ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించనుంది. 5న నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ప్రస్తుతం రెపో రేటు (బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) 6.5 శాతంగా ఉంది. రివర్స్ రెపో(ఆర్‌బీఐ వద్ద ఉంచే నగదుపై బ్యాంకులకు లభించే వడ్డీ) 6.25 శాతంగా కొనసాగుతోంది. ఇక సీఆర్‌ఆర్(నగదు నిల్వల నిష్పత్తి– బ్యాంకులు తమ డిపాజిట్ నిల్వల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం–దీనిపై ఎలాంటి వడ్డీ లభించదు) 4 శాతం వద్ద ఉంది.
రూపాయి రివర్స్‌గేర్...
అక్టోబర్‌లో సమీక్ష నాటికి డాలరుతో రూపాయి మారకం విలువ 72–73 రికార్డు కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఆతర్వాత 74.5 స్థాయికి కూడా క్షీణించి వేగంగా కోలుకుంది. ప్రస్తుతం మళ్లీ కీలకమైన 70 ఎగువకు రికవరీ అయింది. మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు ధర (బ్రెంట్ క్రూడ్) 85 డాలర్ల నుంచి ఇప్పుడు ఏకంగా 60 డాలర్ల కిందికి దిగొచ్చింది. ఈ రెండు అంశాలూ ఆర్‌బీఐ రేట్ల పెంపు ఆలోచనలను పక్కనబెట్టేలా చేస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇదిలాఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(2018–19, క్యూ2)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు కాస్త మందగించి 7.1 శాతానికి పరిమితమైంది. తొలి త్రైమాసికం(క్యూ1)లో వృద్ధి రేటు 8.2 శాతానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. గతేడాది క్యూ2లో వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 3.31%కి దిగొచ్చింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి కూడా. ప్రధానంగా ఆహారోత్పత్తుల ధరలు తగ్గడం దీనికి కారణం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 3.7 శాతం.
ఎవరేమంటున్నారంటే...
ఆర్‌బీఐ ఈ నెల 5న ప్రకటించనున్న పరపతి విధాన సమీక్ష నిర్ణయంలో కీలక రేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చని కోటక్ రీసెర్చ్ అభిప్రాయపడింది. ‘గత సమీక్షలో ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం రిటైల్ ద్రవ్యోల్బణం 3.9–4.5 శాతంగా ఉండొచ్చని, అదేవిధంగా వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో 4.8 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. అయితే, ఆహార ధరలు భారీగా దిగిరావడంతో ద్వితీయార్ధంతో 2.9–4.3 శాతం, వచ్చే ఏడాది తొలి క్వార్టర్‌లో 4.5 శాతం స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఉండొచ్చని మేం భావిస్తున్నాం.
మరోపక్క, గత కొద్ది నెలలుగా భగ్గుమన్న పెట్రో ధరలు.. శాంతించడం కూడా ద్రవ్యోల్బణం దిగొచ్చేందుకు తోడ్పడుతుంది’ అని కోటక్ రీసెర్చ్ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి జీడీపీ వృద్ధిరేటు 7.3 శాతంగా ఉండొచ్చని.. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకనమిస్ట్ దేవేంద్ర కుమార్ పంత్ అంచనా వేశారు. ఈ తరుణంలో పాలసీలో ఆర్‌బీఐ రెపో రేటులో మార్పులూ చేయకపోచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment