ఎక్కడి రేట్లు అక్కడే..! | RBI likely to maintain status quo on April 6 | Sakshi
Sakshi News home page

ఎక్కడి రేట్లు అక్కడే..!

Published Mon, Apr 3 2017 12:40 AM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

ఎక్కడి రేట్లు అక్కడే..!

ఎక్కడి రేట్లు అక్కడే..!

6న ఆర్‌బీఐ పాలసీ సమీక్ష...
కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశం
ద్రవ్యోల్బణం పెరుగుదల, అంతర్జాతీయ ప్రతికూలతలే కారణం
నిపుణుల అభిప్రాయం...  


న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఈసారి కూడా కీలక పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకుతుండటం... అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలే దీనికి కారణమని వారు పేర్కొంటున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ తొలి ద్వైమాసిక పాలసీ సమీక్ష ఈ నెల 6న(గురువారం) జరగనుంది. అమెరికాలో వడ్డీరేట్ల పెరుగుదల... ఆర్‌బీఐ ఇప్పుడప్పుడే పాలసీ రేట్లను తగ్గించే ఆస్కారం లేదనేందుకు తగిన సంకేతమని, అంతేకాకుండా దేశీ, విదేశీ అంశాల ఆధారంగా భవిష్యత్తులో రేట్లు పెంచినాపెంచొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం.

ఎవరేమంటున్నారంటే...
‘రానున్న పాలసీలో ఆర్‌బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేసే అవకాశం లేదని భావిస్తున్నా. తదుపరి నెలల్లో పరిస్థితులను బట్టి పావుశాతం తగ్గింపు/పెంపునకు వీలుంది’ అని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ ఉదయ్‌ కోటక్‌ వ్యాఖ్యానించారు. ‘2017 మార్చినాటికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 శాతానికి పరిమితం కావాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం. దీనికంటే తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే, మధ్యకాలానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 4 శాతంగా కొనసాగించడంపై పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో 6న జరిగే పాలసీ సమీక్షలో రెపో రేటు తగ్గింపు ఉండకపోవచ్చు’ అని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ఎండీ నరేశ్‌ టక్కర్‌ పేర్కొన్నారు. కాగా, గత సమీక్షలో ఆశ్చర్యకరమైన రీతిలో ఆర్‌బీఐ సరళ విధానం నుంచి తటస్థానికి మారుతున్నట్లు ప్రకటించిందని.. రానున్న సమీక్షలో కూడా ఇదే విధానం ఉండొచ్చని సింగపూర్‌కు చెందిన బ్యాంకింగ్‌ దిగ్గజం డీబీఎస్‌ అభిప్రాయపడింది.

ఒక్క కోతతో సరి...
ఆర్‌బీఐ గవర్నర్‌గా గతేడాది సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టి తర్వాత తొలిసారి అక్టోబర్లో జరిపిన సమీక్షలో ఉర్జిత్‌ పటేల్‌ రెపో రేటును పావు శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ఎంపీసీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి భేటీ కూడా అదే. ఇక అప్పటి నుంచి కీలక రేట్లను యథాతథంగానే కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 8న చేపట్టిన సమీక్షలోనూ ఇదే వైఖరిని అవలంభించారు. ద్రవ్యోల్బణం ధోరణి, ఆర్థిక వృద్ధిపై పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌) ప్రభావంపై మరింత స్పష్టత కోసం వేచిచూస్తున్నామని... దీనికి అనుగుణంగానే పాలసీ రేట్లలో మార్పులు ఉంటాయని గత సమీక్ష సందర్భంగా ఉర్జిత్‌ పటేల్‌ స్పష్టం చేశారు.

అంతేకాకుండా సరళ పాలసీ నుంచి తటస్థ విధానానికి మారుతున్నట్లు ప్రకటించడం ద్వారా ఆర్‌బీఐ ఒకరకంగా షాకిచ్చింది కూడా. అంటే రేట్ల తగ్గింపు విధానానికి ఇక బ్రేక్‌ పడినట్లే లెక్క. టోకు ధరల(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రేటు ఫిబ్రవరిలో 39 నెలల గరిష్టానికి(6.55 శాతం) ఎగబాకడం కలవరపరిచే అంశం. అదేవిధంగా రిటైల్‌ ద్రవ్యోల్బ ణం కూడా 3.65 శాతానికి పెరిగింది. ప్రధానంగా ఆహార, ఇంధన ధరల పెరుగుదల దీనికి కారణం. ద్రవ్యోల్బణం పెరుగుదలను చూస్తుంటే ఆర్‌బీఐ వడ్డీరేట్లను కదిలించే అవకాశల్లేవనేది విశ్లేషకుల అంచనా.

ప్రస్తుతం రేట్లు ఇలా...
ప్రస్తుతం రెపో రేటు(ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) 6.25%గా కొనసాగుతోంది. ఇక రివర్స్‌ రెపో(బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచే నిధులపై లభించే వడ్డీరేటు) 5.75% వద్ద, నగదు నిల్వల నిష్పతి(సీఆర్‌ఆర్‌–బ్యాంకులు తమ డిపాజిట్‌ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం–దీనిపై ఆర్‌బీఐ ఎలాంటి వడ్డీ చెల్లించదు) 4%గా ఉన్నాయి.

గవర్నర్‌ జీతం రెట్టింపు...
ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్, డిప్యూటీ గవర్నర్‌ వేతనాలను ప్రభుత్వం దండిగానే పెంచింది. బేసిక్‌ సాలరీ నెలకు రెట్టింపునకుపైగా ఎగబాకింది. దీని ప్రకారం గవర్నర్‌ బేసిక్‌ సాలరీ రూ.2.5 లక్షలకు, డిప్యూటీ గవర్నర్లకు రూ.2.25 లక్షలకు చేరింది. ఈ పెంపును జనవరి 1, 2016 నుంచి వర్తింపజేయనున్నారు. సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద ఒక దరఖాస్తునకు స్పందిస్తూ ఆర్‌బీఐ ఈ వివరాలను వెల్లడించింది. జీతం పెంపు సమాచారాన్ని తమకు ఫిబ్రవరి 21న ఆర్థిక శాఖ తెలియజేసిందని పేర్కొంది. పెంపునకు ముందు గవర్నర్‌ బేసిక్‌ పే(మూల వేతనం) రూ.90,000 కాగా, డిప్యూటీ గవర్నర్లకు రూ.80,000 ఉంది. ఆర్‌బీఐ వెబ్‌సైట్లోని తాజా సమాచారంమేరకు నవంబర్‌లో ఉర్జిత్‌ నెల జీతం(బేసిక్‌ పే, డీఏ, ఇతర చెల్లింపులు కలుపుకొని) రూ.2,09,500. ఇందులో డీఏ రూ.1,12,500 కాగా, ఇతర చెల్లింపులు రూ.7,000గా ఉన్నాయి.

పెంచిన తర్వాత స్థూల వేతన వివరాలను ఆర్‌బీఐ వెల్లడించలేదు. అయితే, పాత డీఏ, ఇతర చెల్లింపులను లెక్కలోకి తీసుకుంటే ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రస్తుత స్థూల వేతనం దాదాపు రూ.3.7 లక్షలకు చేరుతుంది. కాగా, ఈ స్థాయిలో పెంచినప్పటికీ.. దేశంలోని పలు ప్రైవేటు బ్యాంకుల చీఫ్‌లతో పోలిస్తే ఇంకా ఆర్‌బీఐ గవర్నర్‌ జీతం చాలా తక్కువే కావడం గమనార్హం. ఉదాహరణకు 2015–16 ఏడాదికి ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈఓ, ఎండీ ఆదిత్య పురి వేతన ప్యాకేజీ(స్టాక్‌ ఆప్షన్స్‌ కాకుండా) రూ.9.73 కోట్లుగా ఉంది. అంటే నెలకు దాదాపు రూ.81 లక్షలు. ఇక ఐసీఐసీఐ చీఫ్‌ చందా కొచర్‌ 2015–16 వార్షిక వేతన ప్యాకేజీ రూ.6.59 కోట్లు(నెలకు రూ.55 లక్షలు) కావడం విశేషం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement