ధరలు తగ్గుతాయన్న అంచనాలతో ‘రేటు కోత’ సరికాదు
♦ ఆర్‌బీఐ గవర్నర్ అభిప్రాయం
♦ జూన్ 6,7 నాటి మినిట్స్ విడుదల
ముంబై: ధరలు రానున్న కాలంలో తగ్గిపోవడానికి అవకాశం ఉందన్న అంచనాల ప్రాతిపదికన రెపో రేటు కోత ఎంతమాత్రం సరికాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయపడుతున్నారు. జూన్ 6, 7 తేదీల్లో జరిగిన ఆర్‌బీఐ ద్రవ్య విధాన పరపతి ద్వైమాసిక సమీక్ష సందర్భంగా రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు. ప్రస్తుతం 6.25 శాతం)ను యథాతథంగా కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
ధరలు పెరిగే అవకాశాలను ఇందుకు కారణంగా చూపింది. వరుసగా ఎనిమిది నెలల నుంచీ ఇదే ధోరణిని అవలంబిస్తోంది. తాజాగా విడుదలైన ఈ నెల 6, 7 తేదీల సమావేశం మినిట్స్ ప్రకారం, ఆర్‌బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సమావేశంలో, ఒకేఒక్క సభ్యుడు రవీంద్ర ధోలాకియా (ఐఐఎం–అహ్మదాబాద్ ఫేకల్టీ) మాత్రం రెపో రేటును అర శాతం అంటే 5.75 శాతానికి తగ్గించాలని సిఫారసు చేశారు. పలు అంశాలను పరిశీలిస్తే... భవిష్యత్తులో ధరల తగ్గుదలకే అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పేలవ పారిశ్రామిక ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అయితే ధరలపై భవిష్యత్ అంచనాల ప్రాతిపదికన రేటు కోత ఎంతమాత్రం సమంజసం కాదని గవర్నర్ అభిప్రాయడ్డారు. మిగిలిన ఐదుగురు సభ్యులూ ఆయన నిర్ణయానికే ఓటేశారు. ఎంపీసీ ఏర్పడిన తర్వాత పాలసీ సమావేశంలో భిన్న అభిప్రాయాలు తలెత్తడం ఇదే తొలిసారి.