భవిష్యత్తు కార్యాచరణపై బ్యాంకర్లు భేటీ
12 కేసుల్లో చర్యలపై సమాలోచనలు
ముంబై: ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా 12 భారీ రుణ ఎగవేత సంస్థలపై చర్యల విషయంలో అనుసరించాల్సిన కార్యాచరణను ఖరారు చేసేందుకు బ్యాంకులు సోమవారం సమావేశమయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ అధికార వర్గాలు అందించిన సమాచారం మేరకు... ఆర్‌బీఐ గుర్తించిన 12 ఖాతాల్లో కొన్నింటిపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించడానికి ముందు కార్యాచరణను ఖరారు చేసేందుకు బ్యాంకులు సమావేశం నిర్వహించాయి.
ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ కింద చర్యలకు ఆర్‌బీఐ గుర్తించిన కేసుల్లో భూషణ్ స్టీల్ (రూ.44,478 కోట్లు), ఎస్సార్ స్టీల్ (రూ.37,284 కోట్లు), భూషణ్ పవర్ అండ్ స్టీల్ (రూ.37,248 కోట్లు), అలోక్ ఇండస్ట్రీస్ (రూ.22,075 కోట్లు), ఆమ్‌టెక్ ఆటో (రూ.14,074 కోట్లు), మోనెత్ ఇస్పాత్ (రూ.12,115 కోట్లు), ల్యాంకో ఇన్‌ఫ్రా (రూ.44,364 కోట్లు), ఎలక్ట్రో స్టీల్స్ (రూ.10,273 కోట్లు), ఎరా ఇన్‌ఫ్రా (రూ.10,065 కోట్లు), జైపీ ఇన్‌ఫ్రాటెక్ (రూ.9,635 కోట్లు), ఏబీజీ షిప్ యార్డ్ (రూ.6,953 కోట్లు), జ్యోతి స్ట్రక్చర్స్ (రూ.5,165 కోట్లు) ఉన్నాయి. వీటిలో ఆమ్‌టెక్ ఆటో, భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, ల్యాంకో ఇన్‌ఫ్రా తదితర కేసుల్లో భవిష్యత్తు కార్యాచరణపై ఈ రోజు బ్యాంకులు చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సంస్థలపై నెలలోపు ఎన్‌సీఎల్‌టీలో కేసులు దాఖలు చేయాలని ఆర్‌బీఐ ఆదేశించడం తెలిసిందే.