మీ బ్యాంకులో గౌరవం ఉందా?
♦ ఖాతాదారులపై పక్షపాతం పనికిరాదు
♦ ఉత్పత్తుల నుంచి గోప్యత వరకూ చూడాల్సిందే
♦ మీ హక్కులకు భంగం కలిగితే ఫిర్యాదు చేయొచ్చు
♦ చార్టర్ ఆఫ్ కస్టమర్ రైట్స్‌ను విడుదల చేసిన ఆర్‌బీఐ
బ్యాంకు ఖాతాదారుకూ హక్కులుంటాయా? అవును... నిజమే!! ఈ మేరకు రిజర్వు బ్యాంకు ‘చార్టర్ ఆఫ్ కస్టమర్ రైట్స్’ను కూడా విడుదల చేసింది. కాకపోతే ఇవి తమకు నిజంగా దక్కుతున్నాయా? లేదా? అనేది చూసుకోవాల్సింది ఖాతాదారులే. దక్కని పక్షంలో ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయొచ్చు కూడా. ఆర్‌బీఐ జారీ చేసిన ఈ నిబంధనల్లో ఖాతాదారులకు ఐదు ప్రాథమిక హక్కులున్నాయి. ఒకవేళ బ్యాంకు ఏదైనా హక్కు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆర్‌బీఐలోని కస్టమర్ సర్వీసెస్ డివిజన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. సంబంధిత బ్యాంకుపై కఠినంగా వ్యవహరించే అధికారాలు ఆర్‌బీఐకి ఉన్నాయి.
పక్షపాత వైఖరి పనికిరాదు...
ఖాతాదారులను వారి ప్రాంతం, వర్ణం, కులం, లింగం, శారీరక సామర్థ్యం, వయసు ఆధారంగా పక్షపాతంతో చూడకూడదు. కాకపోతే ఖాతాదారులకు భిన్నమైన రకాలున్న వడ్డీరేట్లతో పథకాలను మాత్రం ఆఫర్ చేయొచ్చు. అంటే సీనియర్ సిటిజన్స్‌కు అదనపు వడ్డీ ఆఫర్ చేయడం లాంటివన్న మాట.
పారదర్శకత, నిజాయితీ...
బ్యాంకు పత్రాల్లో ఉన్న భాష ఓ పట్టాన అర్థం కావడం లేదనుకోండి. అర్థమయ్యేలా మార్చాలని కోరవచ్చు. ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు అన్ని రకాల పత్రాలను సాధారణ వ్యక్తులు సైతం సులభంగా అర్థం చేసుకునే విధంగా రూపొందించాలి. ఈ విషయంలో జవాబుదారీ బ్యాంకులదే. పథకం, ఖాతాదారుడి బాధ్యతలు, రిస్క్ గురించి స్పష్టంగా తెలియజేయాలి. అలాగే, ముఖ్యమైన నిబంధనలు, షరతుల గురించి కూడా చెప్పాలి.
కమీషన్ల కోసం అంటగ డితే తప్పే!
కమిషన్ల కోసం ఖాతాదారులకు పనికిరాని ఉత్పత్తులను అంటగట్టకూడదు. ఉదాహరణకు వృద్ధులకు యూనిట్ లింక్డ్ పాలసీలను సూచించకూడదు. ఎందుకంటే వాటిలో రిస్క్ ఎక్కువుంటుంది. ఆ వయసులో వారు దాన్ని భరించటం కష్టం. కస్టమర్ల అవసరాలు తెలుసునని వాటికి సరిపోయే పథకాలను మాత్రమే సూచించాలి.
గోప్యత తప్పనిసరి...
ఖాతాదారుల సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. అంటే ఖాతాదారుల సమాచారాన్ని టెలిమార్కెటింగ్ కంపెనీలకు ఇవ్వకూడదన్న మాట. అలాగే ఇతర ప్రయోజనాల కోసం కూడా వాడుకోకూడదు. ఈ సమాచారాన్ని వేరే సంస్థలకు అందించడం వల్ల ఆయా కంపెనీలు కస్టమర్ల వివరాల ఆధారంగా వారికి తమ ఉత్పత్తులను మోసపూరిత పద్ధతిలో విక్రయించకుండా ఉండేందుకు ఆర్‌బీఐ ఈ నిబంధన తీసుకొచ్చింది.
విక్రయంతో బాధ్యత తీరిపోదు...
బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఉత్పాదనలను మార్కెటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. సొంత పథకాలు గానీ, ఇతర సంస్థల పథకాలు గానీ విక్రయించేసి చేతులు దులుపుకోవడమంటే కుదరదు. తమవైపు తప్పిదం జరిగితే చెల్లించే పరిహారం, సమస్యవస్తే పరిష్కార విధానం, ఇతర నిబంధనల గురించి కూడా తెలియజేయాలి.