సంస్కరణల 2020- బెస్ట్‌ 10 స్టాక్స్‌ | Reforms year 2020- 10 best stocks to invest | Sakshi
Sakshi News home page

సంస్కరణల 2020- బెస్ట్‌ 10 స్టాక్స్‌

Published Tue, May 26 2020 3:11 PM | Last Updated on Tue, May 26 2020 3:22 PM

Reforms year 2020- 10 best stocks to invest - Sakshi

కోవిడ్‌-19 కల్లోలాన్ని ఎదుర్కొనేందుకు అటు ప్రభుత్వం, ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకుంటున్న పలు చర్యలు సంస్కరణల దిశగా ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో 2020ను సంస్కరణల ఏడాదిగా అభివర్ణిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం, ఆర్‌బీఐ ప్రకటించిన సంస్కరణలు రానున్న రెండుమూడేళ్లలో ఆర్థిక వ్యవస్థకు జోష్‌నివ్వగలవని అభిప్రాయపడ్డారు. స్వల్ప కాలంలో వీటి ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండుమూడేళ్ల కాలానికి పెట్టుబడికి అనువైన 10 స్టాక్స్‌ను సూచిస్తున్నారు. వివరాలు చూద్దాం...

1991లో 
మూడు దశాబ్దాల క్రితం అంటే 1991లో సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మార్కెట్‌, సర్వీసుల ఆధారితంగా రూపుదిద్దుకున్నదని విశ్లేషకులు తెలియజేశారు. కొద్ది రోజులుగా ఓవైపు ప్రభుత్వం, మరోపక్క ఆర్‌బీఐ జీడీపీలో 10 శాతం వాటాకు సమానమైన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని అమలు చేస్తున్నాయి. దీంతో ఈ ఏడాది(2020) సంస్కరణల నామ సంవత్సరంగా నిలవనున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు.

కరెక్షన్‌ అవకాశం
ఇటీవల మార్కెట్లలో గరిష్టాల నుంచి వచ్చిన 40 శాతం కరెక్షన్‌ ఇన్వెస్టర్లకు మంచి పెట్టుబడి అవకాశాలను కల్పించినట్లు స్టాక్‌ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా పలు రంగాలు సవాళ్ల నుంచి బయటపడి అవకాశాలను అందిపుచ్చుకునే వీలున్నట్లు ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ పంకజ్‌ పాండే తెలియజేశారు. ప్రధానంగా రక్షణ, విద్యుత్‌, మౌలికసదుపాయాలు, ఎంఎస్‌ఎంఈలు, గనులను పేర్కొంటున్నారు. ప్రభుత్వ ప్యాకేజీ భారీస్థాయిలో నిధుల వెచ్చింపునకుకాకుండా క్రెడిట్‌ గ్యారంటీలకే అధిక ప్రాధాన్యమిచ్చిందని ఏంజెల్‌ బ్రోకింగ్‌ డీవీపీ ఈక్విటీ నిపుణులు జ్యోతి రాయ్‌ పేర్కొన్నారు. అయితే వ్యవసాయం, విద్యుత్‌ వంటి రంగాలలో కీలక సంస్కరణలు చేపట్టిందని తెలియజేశారు. మధ్య, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు మేలు చేయగలవని అభిప్రాయపడ్డారు. నిత్యావసరాల కమోడిటీల చట్టం, టారిఫ్‌ విధానాల సంస్కరణల ద్వారా వ్యవసాయం, విద్యుత్‌ రంగాలకు దన్నునిచ్చినట్లు ప్రశంసించారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: గతేడాది క్యూ4లో డిపాజిట్లు పుంజుకోవడం, నికర వడ్డీ మార్జిన్లు బలపడటం సానుకూల అంశాలు. ఇటీవల కొత్త రుణ విడుదల మందగించినప్పటికీ పటిష్ట నెట్‌వర్క్‌, ఆస్తుల నాణ్యత వంటి అంశాలు వృద్ధికి దోహదం చేయగలవు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో అన్‌సెక్యూర్డ్‌ రుణాలు ఆందోళనలు కల్పిస్తున్నందున బ్యాంక్‌ షేరుపై ఒత్తిడి పడింది. ఎంఎస్‌ఎంఈ విభాగంలో 13 శాతం ఎక్స్‌పోజర్‌, ఐబీసీ కోడ్‌లో సవరణలు కొంతమేర బ్యాంకింగ్‌ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే వీలుంది.

ఏషియన్‌ పెయింట్స్‌: దేశీ బిజినెస్‌పైనే అధికంగా ఆధారపడటంతో సవాళ్లతోకూడిన వాతావరణంలోనూ అమ్మకాల పరిమాణంలో రెండంకెల వృద్ధిని సాధించింది. ముడిసరుకుల ధరలు తగ్గడం, చమురు ధరలు నీరసించడం వంటి అంశాలు స్థూల మార్జిన్లకు దన్నునిచ్చే అవకాశముంది. ఈ అనుకూలతలను కస్టమర్లకు అందించడం ద్వారా ప్రొడక్టులకు డిమాండ్‌ను పెంచుకునే వీలుంది. పటిష్ట బ్యాలన్స్‌షీట్‌కుతోడు.. రుణ రహిత కంపెనీకావడంతో ప్రీమియం వేల్యుయేషన్స్‌ను సాధిస్తోంది. 

పీఐ ఇండస్ట్రీస్‌: ఈ ఏడాదికి సక్రమ రుతుపవన అంచనాలు, కొత్త ప్రొడక్టుల విడుదల కారణంగా దేశీ అమ్మకాలు పుంజుకునే వీలుంది. చైనా నుంచి సరఫరాలు పడిపోవడం, కఠిన నియంత్రణల నేపథ్యంలో కస్టమ్స్‌ సింథసిస్‌, కాంట్రాక్ట్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌(సీఎస్‌ఎం) విభాగం నుంచి ఆర్డర్లు పెరిగే అవకాశముంది.

మహానగర్‌ గ్యాస్‌: ముంబై మహానగరానికి ఏకైక పంపిణీ సంస్థకావడంతోపాటు.. నిత్యావసరంగా వినియోగించే గ్యాస్‌ డిమాండ్‌పై కోవిడ్‌-19 పెద్ద ప్రభావం చూపలేదు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం శుద్ధ ఇంధనాలను ప్రోత్సహిస్తున్న కారణంగా గ్యాస్‌కు డిమాండ్‌ ఊపందుకోనుంది. ఇటీవల సహజవాయు ధరలు క్షీణించడంతో వ్యయాలు తగ్గి మార్జిన్లు మెరుగుపడే అవకాశముంది.

పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌: అధెసివ్‌ విభాగంలో కంపెనీ 70 శాతం మార్కెట్‌ వాటాతో ఆధిపత్యం వహిస్తోంది. దీనికితోడు ఆర్థికంగా పరిపుష్టతను కలిగి ఉంది. పటిష్ట బ్యాలన్స్‌షీట్‌, రుణరహిత కంపెనీకావడమేకాకుండా గత ఐదేళ్లుగా 27 శాతం ఆర్‌వోఈని సాధిస్తోంది. దీంతో ప్రీమియం వేల్యుయేషన్స్‌ను అందుకుంటోంది. చమురు ధరల పతనం కంపెనీకి లబ్దిని చేకూర్చగలదు.
- వినోద్‌ నాయర్‌, రీసెర్చ్‌ హెడ్‌, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

భారత్‌ ఫోర్జ్‌: డిఫెన్స్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) పరిమితిని పెంచడంతో కంపెనీకి లబ్ది చేకూరే వీలుంది. రక్షణ రంగ సంబంధ తయారీలో ఆటోమాటిక్‌ మార్గం ద్వారా ఇకపై 74 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంటుంది. ఇందుకు వీలుగా  49 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐల పరిమితిని 74 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది. తద్వారా రక్షణ రంగంలో దేశీ తయారీకి అండగా నిలవనుంది. 

ర్యాలీస్‌ ఇండియా: భారీ ప్యాకేజీలో భాగంగా వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలతో ఫెర్టిలైజర్స్‌, సస్యరక్షణ కంపెనీలకు అవకాశాలు పెరగనున్నాయి. 

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌: ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 30,000 కోట్లమేర ప్రత్యేక లిక్విడిటీ పథకం, రూ. 45,000 కోట్ల పాక్షిక క్రెడిట్‌ గ్యారంటీ పథకాలతో నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు మేలు చేకూరనుంది. దీర్ఘకాలంలో ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, మైక్రోఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ లబ్డి పొందనున్నాయి.

లార్సెన్‌ అండ్‌ టుబ్రో: డిఫెన్స్‌ రంగంలో ఆటోమాటిక్‌ రూట్‌ ద్వారా 74 శాతం ఎఫ్‌డీఐలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఈ మౌలిక రంగ దిగ్గజానికి మరిన్ని అవకాశాలు లభించే వీలుంది. దీర్ఘకాలంలో ఇది కంపెనీకి సానుకూల అంశంగా నిలవనుంది. 
- గౌరవ్‌ గార్గ్‌, రీసెర్చ్‌ హెడ్‌, క్యాపిటల్‌వయా గ్లోబల్‌

ఫినొలెక్స్‌ ఇండస్ట్రీస్‌: దేశీయంగా పైపుల తయారీలో రెండో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. వ్యవసాయ రంగ పైపుల విభాగంలో అధిపత్యం వహిస్తోంది. పీవీసీ పైపుల తయారీ సామర్ధ్యాన్ని 3.7 లక్షల టీపీఏకు పెంచుకుంది. 2015లో ఇది 2.5 లక్షలేకాగా.. ప్రస్తుతం రెజిన్‌ తయారీ సామర్థ్యం 2.72 లక్షల టీపీఏగా నమోదైంది. లూబ్రిజోల్‌తో ఒప్పందం ద్వారా 2017 ఫిబ్రవరిలో సీపీవీసీ విభాగంలోకి ప్రవేశించింది.
- రిలయన్స్‌ సెక్యూరిటీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement