మగ్గాలకేదీ మద్దతు?
సాక్షి, కాకినాడ :తరతరాలుగా.. సన్నని దారాల నుంచి వన్నెల వస్త్రాల్ని సృష్టిస్తూ అన్నవస్త్రాలను సముపార్జించుకుంటున్న నేత కుటుంబాలను ఆదుకోవాలన్న సంకల్పంతో కేంద్రం ప్రవేశపెట్టిన చేనేత రుణపరపతి పథకం జిల్లాలో వారికి అక్కరకు రావడం లేదు. కుటుంబం మొత్తం రేయింబగళ్లు రెక్కలు ముక్కలు చేసుకున్నా రోజు గడవని దుస్థితి తప్పడం లేదు. జిల్లాలో రెండులక్షల మందికి పైగా నేత కార్మికులుండగా వారిలో లక్ష మందికి పైగా మగ్గాలపైనే ఆధారపడ్డారు. ఉప్పాడ, బండార్లంక, గొల్లప్రోలు, పుల్లేటికుర్రు, మోరి, కె.జగన్నాథపురం, ద్వారపూడి, విలసవిల్లి తదితర గ్రామాల్లో దాదాపు 18,000 గోతి మగ్గాలు ఉండగా, ఒక్కోదానిపై నలుగురు చొప్పున ఆధారపడ్డారు. చేనేత కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అర్హులకు వ్యక్తిగత రుణాలందించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం 2012లో రివైవల్ రిఫార్మ్స్ రీస్ట్రక్చర్ (ఆర్‌ఆర్‌ఆర్) స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.
అర్హులైన చేనేత కార్మికులకు రుణపరపతి కార్డులు జారీచేసి, బ్యాంకులనుంచి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.లక్ష వరకు రుణం ఇప్పించాలని నిర్ణయించింది. తొలిఏడాది తీసుకున్న రుణంలో రూ.4,200 వరకు సబ్సిడీగా ఇచ్చారు. అదే ఈ ఏడాది సబ్సిడీ మొత్తం 20 శాతం లేదా గరిష్టంగా రూ.10 వేలకు మించకుండా ఇస్తున్నారు. బ్యాంకులు వసూలు చేసే 12 శాతం వడ్డీలో రుణం సక్రమంగా చెల్లించే వారికి అందులో సగాన్ని నాబార్డు తిరిగి చెల్లించనుంది. నూలు, రసాయనాల వంటి ముడిసరుకులు, నేతకు ఉపయోగించే యంత్ర పరికరాల కొనుగోలుకు మాత్రమే ఈ రుణాలు మంజూరు చేస్తారు. వాటిని సంబంధిత కంపెనీల పేరిటే మంజూరు చేస్తారు. ఆశయం మంచిదైనా అధికారుల ఉదాసీనత, బ్యాంకర్ల నిర్లక్ష్యం వల్ల ఆచరణలో నీరుగారిపోతోంది.
మార్గదర్శకాల బేఖాతరు..
రుణాలు పొందేందుకు మగ్గాలపై నేసే వారు లేదా చేనేత అనుబంధ రంగాలపై ఆధారపడిన వారై ఉండాలి. చేనేత గుర్తింపు కార్డు కలిగి బ్యాంకుల్లో వారి పేరిట గతంలో ఎలాంటి రుణబ కాయిలు ఉండకూడదు. అలాంటి వారు ఎలాంటి హామీలు, పూచీకత్తులు సమర్పించనక్కర లేదు. మార్గదర్శకాలు ఇంత స్పష్టంగా ఉన్నా రుణాల మంజూరులో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో అతికొద్ది మందికి, అరకొర రుణం మంజూరు చేసి చేతులు దులుపుకొంటున్నాయి. పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్కరికీ రూ.30 వేలకు మించి రుణం ఇవ్వలేదు. జిల్లాలో గత రెండేళ్లలో రుణాలు పొందేందుకు ఏడు వేలమందికి పైగా దరఖాస్తు చేసుకుంటే వారిలో అర్హులైన 5,250 మంది దరఖాస్తులను జిల్లా చేనేత జౌళిశాఖ అధికారులు బ్యాంకులకు సిఫార్సు చేశారు. వారిలో కేవలం 2,800 మందికి మాత్రమే బ్యాంకులు రుణాలిచ్చాయి. 2012-13లో 3,200 మంది దరఖాస్తులను సిఫార్సు చేస్తే కేవలం 1,500 మందికి రూ.3 కోట్ల రుణపరపతి కల్పించారు.
2013-14లో 2,050 మంది దరఖాస్తులను పంపితే కేవలం 1,300 మందికి రూ.రెండున్నర కోట్లు మాత్రమే రుణాలిచ్చారు. ఇక 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ ఒక్కరికి ఒక్క రూపాయి రుణం మంజూరు చేసిన దాఖలాలు లేవు. ఇటీవల ఈ పథకంపై జరిపిన సమీక్షలో.. 2012-14 మధ్య బ్యాంకర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు ఈ ఏడాది కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణ పరపతి కల్పించాలని కలెక్టర్ నీతూప్రసాద్ బ్యాంకర్లను ఆదేశించారు. కనీసం ఈ ఏడాది 3,300 మందికి రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ ఏడాది ఏ ఒక్కరికీ రూ.50 వేలకు తక్కువ కాకుండా రుణం మంజూరు చేయాలని భావిస్తున్నారు. బ్యాంకర్ల నుంచి సహకారం లభించకపోవడం వల్లే వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోతున్నాయని చేనేత జౌళి శాఖ ఏడీ లక్ష్మణరావు పేర్కొన్నారు. కనీసం ఈ ఏడాదైనా బ్యాంకర్లు ఆశించిన స్థాయిలో సహకరించగలరని భావిస్తున్నామన్నారు.