ముకేశ్ మేజిక్!
ఉచితం ఒక ఫోన్–ఒక షేర్
♦ 40వ ఏజీఎంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంచలన ప్రకటన
♦ ఉచితంగా 4జీ ఫీచర్ మొబైల్ ‘జియో ఫోన్’
♦ రూ. 1,500 సెక్యూరిటీ డిపాజిట్ కడితే చాలు; మూడేళ్ల తర్వాత మళ్లీ వెనక్కి
♦ నెలకు రూ.153 టారిఫ్; వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం.. అపరిమిత డేటా
♦ ఆగస్ట్ 15న ప్రయోగాత్మకంగా విడుదల... 24 నుంచి బుకింగ్స్ మొదలు
♦ 50 కోట్ల మంది అల్పాదాయ యూజర్లను ఆకర్షించడమే లక్ష్యం...
♦ వాటాదారులకు బంపర్ ఆఫర్; ఒక షేరుకు మరో షేరు ఫ్రీ
♦ గంటన్నరపాటు ఏజీఎంలో ప్రసంగించిన ముకేశ్....
♦ తొలిసారి ఏజీఎం వేదికపైకి ఎక్కిన కుమారుడు ఆకాశ్, కుమార్తె ఇషా
టెలికం రంగంలోకి అడుగుపెడుతూనే వినూత్న ఆఫర్లతో సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్... మరో సరికొత్త సంచలనంతో ప్రత్యర్థి కంపెనీల్లో దడ పుట్టించింది. కంపెనీ 40వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఆర్‌ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించిన ఆఫర్లతో రిలయన్స్ జియో కస్టమర్లతోపాటు రిలయన్స్ వాటాదారుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. రిలయన్స్ జియో కస్లమర్లుగా చేరేవారికి ఉచితంగా మొబైల్ ఫోన్‌ను ఇవ్వడంతోపాటు జీవితకాలంపాటు ఉచిత వాయిస్ కాల్స్, అతితక్కువ ధరకు అన్‌లిమిటెడ్ 4జీ డేటా ఆఫర్ ప్రకటించారు. అంతేకాదు ఆర్‌ఐఎల్ ఇన్వెస్టర్లకు ప్రతి ఒక్క షేరుకి మరో షేరును ఇవ్వనున్నట్లు ముకేశ్ ఏజీఎంలో వెల్లడించారు. మొత్తంమీద ఈసారి ఏజీఎంలో ముకేశ్ ప్రసంగం, అనూహ్య నిర్ణయాలను చూస్తే...ధీరూభాయ్ రోజుల్లో ఏజీఎంను తలపించిందనేది కార్పొరేట్ వర్గాల విశ్లేషణ.
ముంబై
శుక్రవారం, జూలై 21, ఉదయం 10.00... ముంబై మహానగరం ఎప్పటిలాగే బిజీబిజీగా రోజును మొదలుపెట్టింది. చిరు జల్లులు కురుస్తున్నాయి. న్యూ మెరైన్ లైన్ రోడ్డులోని బిర్లా మాతోశ్రీ ఆడిటోరియం వద్ద మాత్రం ఆ వర్షాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా కిక్కిరిసిన జనసందోహం లోనికి వెళ్లేందుకు క్యూ కట్టారు. వీళ్లంతా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్లు. ఇక్కడ జరుగుతున్న కంపెనీ 40వ ఏజీఎంలో అధినేత ముకేశ్ అంబానీ ఎలాంటి ప్రకటనలు చేస్తారోనన్న ఉత్కంఠ అక్కడున్నవారిలోనే కాదు... దేశవ్యాప్తంగా కూడా నెలకొంది. అయితే, సన్నగా మొదలైన వర్షం.. ఆ తర్వాత ముకేశ్ అంబానీ ప్రకటించే ఆఫర్ల సునామీగా మారుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు.
ఎందుకంటే ఏజీఎంలో ఆయన చేసిన అనూహ్య ప్రకటనలు అటు కంపెనీ వాటాదారులు, ఇటు టెలికం యూజర్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తే... పోటీ టెలికం సంస్థలకు మాత్రం మరోసారి గట్టి షాక్ తగిలేలా చేశాయి. తమ టెలికం అనుబంధ సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లుగా మారేవారికి ఎవరికైనా ఉచితంగా టెలిఫోన్‌ను ఇస్తామని ముకేశ్ ఏజీఎంలో ప్రకటించారు. ‘జియో ఫోన్’ పేరుతో ఈ 4జీ ఫీచర్ ఫోన్‌ను ఏజీఎంలో ప్రవేశపెట్టారు. గంటన్నరపాటు ప్రసంగించిన ముకేశ్ అంబానీ... చివర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులకు 1:1 బోనస్ షేర్లను ప్రకటించడంతో ఇన్వెస్టర్ల హర్షధ్వానాలతో ఆడిటోరియం దద్దరిల్లింది.
గతేడాది సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో సేవలను ప్రారంభించి ఉచిత వాయిస్, అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్లతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. సేవలు ప్రారంభించిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది యూజర్లను దక్కించుకుని జియో కొత్త రికార్డును సృష్టించింది కూడా. ప్రస్తుతం జియోకు 12.5 కోట్లకుపైగా సబ్‌స్క్రయిబర్లు ఉన్నట్లు అంచనా. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కంపెనీ బిల్లింగ్‌ను కూడా మొదలుపెట్టింది. ప్రధానంగా ఉచిత జియో ఫోన్ ఆఫర్‌తో దేశంలోని 50 కోట్ల మందికిపైగా ఫీచర్ ఫోన్‌లను వాడే అల్పాదాయ వర్గాలను తమ కస్టమర్లుగా మార్చేసుకోవాలనేది రిలయన్స్ జియో లక్ష్యంగా కనబడుతోంది.
ఫోన్ ఉచితమే కానీ....
జియో ఫోన్‌ను ముకేశ్ అంబానీ ‘ఇంటెలిజెంట్ ఫోన్’గా అభివర్ణించారు. అంతేకాదు ‘ఇండియా కా స్మార్ట్‌ఫోన్’ అనేది జియో ఫోన్ నినాదం కావడం గమనార్హం. అయితే, పైసా చెల్లించకుండానే ఈ 4జీ ఫోన్‌ను ఎవరైనా తీసుకోవచ్చని ప్రకటించిన ముకేశ్ అంబానీ.. ఒక మెలిక మాత్రం పెట్టారు. వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1,500 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దీన్ని మూడేళ్ల తర్వాత(36 నెలలు) తిరిగి ఇచ్చేస్తామన్నారు. ‘జీవిత కాలం పాటు వాయిస్ కాలింగ్ అనేది ఉచితం. నెలకు రూ.153 చొప్పున టారిఫ్‌ను చెల్లిస్తే... అపరిమిత డేటా సేవలను పొందొచ్చు. ఆగస్ట్ 15న ప్రయోగాత్మకంగా ఈ ఫోన్‌లను ప్రవేశపెడతాం. 24 నుంచి ప్రీ–బుకింగ్స్ మొదలవుతాయి. ముందస్తు బుకింగ్ చేసుకున్నవారికి సెప్టెంబర్ నుంచి ఫోన్‌లను చేతికి అందిస్తాం’ అని అంబానీ వివరించారు. వారానికి 50 లక్షల జియో ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని... ఈ ఏడాది చివరి త్రైమాసికంనాటికి వీటిని పూర్తిగా ఇక్కడే తయారు చేయనున్నామని తెలిపారు. కాగా, ఆఫర్‌లో భాగంగా జియో ఫోన్‌లోని కంటెంట్‌ను టీవీలో చూసేవిధంగా కనెక్ట్ చేసుకోవడానికి ఒక కేబుల్‌ను కూడా కంపెనీ ఇవ్వనుంది.
ప్రపంచ టాప్–50 కంపెనీల్లో చోటే లక్ష్యం...: ‘రిలయన్స్ 50వ ఏజీఎం నాటికి(ప్రస్తుతం 40వది) ప్రపంచంలో టాప్–50 కార్పొరేట్ కంపెనీల్లో ఒకటిగా రిలయన్స్‌ను నిలబెట్టాలనేది నా లక్ష్యం. వచ్చే పదేళ్లూ మనకు స్వర్ణయుగమే’ అని ముకేశ్ అంబానీ ప్రకటించగానే... హాల్ అంతా చప్పట్లు, ఈలలతో మార్మోగింది. ‘వచ్చే పదేళ్లలో రిలయన్స్ అసామాన్యమైన వృద్ధిని సాధిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం నాకు ఉంది. అంతేకాదు భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా చేదోడు అందించనున్నాం కూడా. తద్వారా గడిచిన 40 ఏళ్లలో మన ఎకానమీ సాధించిన ప్రగతి వచ్చే పదేళ్లలో కొత్త పుంతలు తొక్కనుంది’ అని ముకేశ్ పేర్కొన్నారు. ఇంధన, మెటీరియల్ వ్యాపారాల్లో వచ్చే కొన్నేళ్లలోనే రూ.లక్ష కోట్ల స్థూల లాభాన్ని సాధించే సత్తా రిలయన్స్‌కు ఉందని చెప్పారు.
ఆర్‌ఐఎల్ విజయ ప్రస్థానంపై ముకేశ్ ఏం చెప్పారంటే...
⇔ 1977లో అంటే కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్టయిన ఏడాది రిలయన్స్ టర్నోవర్ రూ.70 కోట్లు. ఇప్పుడిది రూ.3,30,000 కోట్లు. 4,700 రెట్లు ఎగబాకింది.
⇔ ఇక 1977లో నికర లాభం రూ.3 కోట్లు కాగా, ప్రస్తుతం ఇది రూ.30,000 కోట్లకు చేరింది. 10,000 రెట్లు దూసుకెళ్లింది.
⇔ కంపెనీ మొత్తం ఆస్తులు రూ.33 కోట్ల నుంచి రూ.7 లక్షల కోట్లకు ఎగిశాయి. 20 వేల రెట్ల వృద్ధి సాధించాం.
⇔ ఇక మార్కెట్‌క్యాప్ అయితే, దాదాపు 50 వేల రెట్లు పెరిగింది. 1977లో రూ.10 కోట్ల నుంచి ఇప్పుడు ఏకంగా రూ. 5లక్షల కోట్లకు ఎగబాకింది. దేశంలో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.
⇔ ఇక 1977లో ఎవరైనా రిలయన్స్ షేర్లలో రూ.1,000 పెట్టుబడి పెట్టి ఉంటే... ఇప్పుడది రూ.16,54,500కు చేరినట్లు లెక్క. అదే రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు అయినట్టే. అంటే ప్రతి రెండున్నరేళ్లకు పెట్టుబడి మొత్తం రెట్టింపు అయింది.
⇔ ఇక జియో విషయానికొస్తే... దేశంలో అతిపెద్ద 4జీ నెట్‌వర్క్ ఏర్పాటు కోసం రూ.2 లక్షల కోట్లను పెట్టుబడిగా వెచ్చించాం. జియో సేవలు ప్రారంభించిననాటి నుంచి ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను జతచేసుకోగలిగాం.
⇔ కేవలం ఆరు నెలల్లోనే భారత్‌లో నెలవారీ డేటా వినియోగం 20 కోట్ల జీబీ నుంచి 120 కోట్ల జీబీకి ఎగబాకింది. డేటా వినియోగంలో మనం అమెరికా, చైనాలను అధిగమించాం కూడా.
⇔ జియో ప్రారంభానికి ముందు మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణలో భారత్ 155 స్థానంలో ఉంది. రానున్న కొన్ని నెలల్లోనే నంబర్ వన్ స్థానానికి చేరేదిశగా దూసుకెళ్తున్నాం. డేటా వినియోగంలో ఇప్పటికే మనం టాప్ ర్యాంకుకు చేరిపోయాం.
బోనస్ బొనాంజా...
40వ∙ఏజీఎంలో ఎవరూ ఊహించని ప్రకటనేదైనా ఉందంటే అది బోనస్ అనే చెప్పొచ్చు. ఎనిమిదేళ్ల వ్యవధి తర్వాత మళ్లీ తమ వాటాదారులకు రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుకు మరో షేరు(1:1 నిష్పత్తిలో)ను ఇవ్వనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. దేశ కార్పొరేట్ చరిత్రలో ఇదే అతిపెద్ద బోనస్ ఇష్యూ అవుతుందని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా రూ.13 చొప్పున డివిడెండ్‌ను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రకటించడం విశేషం. కాగా, లిస్టెడ్ కంపెనీగా 40 ఏళ్ల రిలయన్స్ చరిత్రలో ఇది నాలుగో బోనస్ కావడం గమనార్హం. చివరిసారిగా కంపెనీ 2009లో బోనస్ షేర్లను ఇచ్చింది. తొలిసారిగా 1983లో 3:5 నిష్పత్తిలో(అంటే ప్రతి 5 షేర్లకు 3 షేర్లు ఉచితంగా) బోనస్ షేర్లను ప్రకటించింది.
కాగా, గురువారం 10 నిమిషాల పాటు డైరెక్టర్ల బోర్డు సమావేశమై ఈ నిర్ణయం తీసుకుందని, బోనస్ షేర్లకు రికార్డు తేదీని తదుపరి ప్రకటించనున్నట్లు కంపెనీ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ పెయిడ్–అప్ షేర్ క్యాపిటల్ రూ.3,251.74 కోట్లు(రూ.10 ముఖ విలువగల 325.17 కోట్ల ఈక్విటీ షేర్లు, ఇందులో 17.18 కోట్ల షేర్లు సబ్సిడరీ కంపెనీలకు చెందినవి). తాజా బోనస్ తర్వాత పెయిడ్–అప్ క్యాపిటల్ రూ.6,331.59 కోట్లకు చేరుతుంది(రూ.10 ముఖ విలువగల 633.15 కోట్ల షేర్లు). కాగా, ఈ ఏడాది ఇప్పటివరకూ 39 భారతీయ కంపెనీలు బోనస్‌లను ప్రకటించాయి.
త్వరలో ల్యాండ్‌లైన్ సేవలు కూడా...
రిలయన్స్ జియో వైర్‌లెస్ సేవల విస్తరణ అనంతరం.. ల్యాండ్‌లైన్(ఫిక్స్‌డ్ లైన్) సేవలను కూడా ప్రవేశపెట్టనున్నామని ముకేశ్ అంబానీ ఏజీఎంలో ప్రకటించారు. ‘తదుపరి దశలో గృహ, వాణిజ్య సంస్థలకు సబంధించి ఫిక్స్‌డ్ లైన్ కనెక్టివిటీపై దృష్టిపెడతాం. ప్రస్తుతానికైతే వచ్చే 12 నెలల్లో దేశంలోని 99 శాతం ప్రజలకు జియో వైర్‌లెస్ నెట్‌వర్క్‌ను చేరువచేయాలన్నది లక్ష్యం. 2జీ కవరేజీ స్థానంలో పూర్తిగా 4జీని తీసుకురావాలన్నదే మా ప్రయత్నమంతా’ అని వాటాదారులు అడిగిన ఒక ప్రశ్నకు ముకేశ్ సమాధానమిచ్చారు. కాగా, బాలాజీ టెలీఫిల్మ్స్‌లో 25 శాతం వాటా కొనుగోలువల్ల ప్రయోజనం ఏంటని కొంతమంది ప్రశ్నించగా.. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సబ్సిడరీ టీవీ18 పనితీరుపైనా మరికొందరు ఇన్వెస్టర్లు ప్రశ్నలు లేవనెత్తారు. టీవీ–18 పనితీరును మెరుగుపరిచి.. విలువను పెంచే ప్రణాళికలపై కసరత్తు జరుగుతోందని ముకేశ్ వెల్లడించారు.
ఏజీఎంకు హాజరైన ముకేశ్, నీతా, ఇషా, అనంత్, ఆకాశ్ (వరుసగా కుడి నుంచి)
ముకేశ్ భావోద్వేగం...
రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, తన తండ్రి ధీరూభాయ్ అంబానీ కంపెనీ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు కంపెనీగా తీర్చిదిద్దిన విధానం, ఆయన మార్గనిర్ధేశం గురించి ప్రస్తావిస్తూ ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఇది కంపెనీకి 40వ వార్షికోత్సవం. నా తండ్రి రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ ఇప్పటికీ మనతోనే ఉన్నారని నేను భావిస్తా. భగవద్గీతలో చెప్పినట్లు ఆత్మకు పుట్టుక మరణం అనేవి ఉండవు. అందుకే ఆయన మన హృదయంలో చిరస్థాయిగా నిలిచే ఉంటారు. అందుకే ఆయనను మనం ఏజీఎంకు సాదరంగా ఆహ్వానిద్దాం’ అంటూ ముకేశ్ తీవ్ర భావోద్వేగంతో చెప్పారు.
దీంతో వేదిక కింద ముందువరుసలో కూర్చున్న తల్లి కోకిలాబెన్ కంటతడి పెట్టారు. ఆమెను ముకేశ్ చిన్న కుమారుడు అనంత్ ఇతర అంతరంగికులు సముదాయించడంతో... కొద్ది క్షణాలు విరామం తర్వాత ముకేశ్ మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా, ప్రసంగం కొనసాగుతుండగానే ధీరూభాయ్ అంబానీకి గత స్మృతులతో కూడిన ఒక లఘు చిత్రాన్ని వేదికవెనుకనున్న తెరపై ప్రదర్శించారు. ‘గడిచిన 40 ఏళ్లలో కంపెనీ సాధించిన విజయాలు (లాభాలు, మార్కెట్ క్యాప్, టర్నోవర్, వాటాదారులకు రాబడి ఇతరత్రా అంశాల్లో) అన్నింటినీ ధీరూభాయ్ అంబానీకి అంకితం ఇస్తున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు.
సందడి చేసిన ఆకాశ్, ఇషా...
ఏజీఎంకు ముకేశ్ అంబానీ... తల్లి కోకిలాబెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కుమార్తె ఇషా అంబానీలతో కలిసి హాజరయ్యారు. కోకిలాబెన్, చిన్న కుమారుడు అనంత్‌లు మాత్రం వేదిక కింద తొలి వరుసలో కూర్చున్నారు. ఇప్పటికే ఆర్‌ఐఎల్ బోర్డులో డైరెక్టర్‌గా ఉన్న నీతా అంబానీతోపాటు తొలిసారిగా ఆకాశ్, ఇషా(వీళ్లిద్దరూ కవలలు. వయస్సు 25 ఏళ్లు) కూడా ముకేశ్‌తో పాటు వేదికపైన కనిపించారు. వాళ్లిద్దరినీ ఇన్వెస్టర్లకు పరిచయం చేసేందుకు ముకేశ్ కీలకమైన 40వ ఏజీఎంను ఉపయోగించుకున్నారు. ‘కంపెనీలో ఒక కొత్త తరం నాయకత్వం ఆవిర్భవిస్తోంది.
రిలయన్స్‌ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడంలో వీళ్లిద్దరికీ మీ ఆశీస్సులు కోరుతున్నా’ అని ముకేశ్ పేర్కొన్నారు. కాగా, ఆకాశ్, ఇషాల నేతృత్వంలో రిలయన్స్ జియో లక్ష మంది ఉద్యోగులతో అత్యంత యవ్వన కంపెనీగా ఆవిర్భవించిందని కూడా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జియో ఫోన్ ప్రత్యేకతలను వివరించాల్సిందిగా ముకేశ్ వారిద్దరినీ ఆహ్వానించారు కూడా. ఆతర్వాత ఆకాశ్, నిషా అంబానీలు జియో ఫోన్ గురించి లైవ్ డెమో ఇచ్చారు.