
సాక్షి,ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో టారిఫ్ వార్‌కు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే రిలయన్స్ జియో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపించింది. తాజాగా కేబుల్ రంగంలో కూడా విధ్వంసానికి రడీ అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో చరిత్రలో అతిపెద్ద లాభాలను నమోదు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కేబుల్ టీవీ, హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో పాక్షిక పెట్టుబడులను పెట్టనున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో జియో ఎంట్రీతో కుదేలైన ఎయిర్‌టెల్‌ను, సిటీ కేబుల్ వ్యాపారాన్ని కూడా దెబ్బతీయనుంది.
దేశీయంగా అతిపెద్ద కేబుల్ ఆపరేటర్ హాత్‌వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్‌వర్క్స్ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రకటించింది. బ్రాడ్ బాండ్ సేవలను పెద్దయెత్తున విస్తరించే క్రమంలో ఈ పెట్టుబడులకు బుధవారం బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హాత్‌వే, డెన్ నెట్‌వర్క్ కంపెనీల్లో మెజారిటీ వాటా తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు రిలయన్స్ రూ. 5,230 కోట్లు చెల్లించనుంది.
హాత్‌వేలో 51.3 శాతం వాటా కొనుగోలుకు రూ. 2,045 కోట్లను రిలయన్స్ చెల్లిస్తుంది. అలాగే డెన్ నెట్‌వర్క్స్‌లో 66 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ. 2,045 కోట్లు. హాత్‌వే, డెన్ నెట్‌వర్స్క్ 1,100 నగరాల్లో 5 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. తాజా డీల్ ద్వారా ప్రత్యక్షంగా 20 మిలియన్ల కేబుల్ చందాదారులు రియలన్స్ అధీనంలోకి రానున్నారు. అంతేకాదు కేబుల్ మార్కెట్లో 23 శాతం వాటాను రిలయన్స్ సొంతం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment