రిలయన్స్ క్యాపిటల్ నుంచి డిజిటల్ సేవలు
కంపెనీ ఈడీ అన్మోల్ అంబానీ వెల్లడి
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా భారీగా మూలధన లాభాలు పొందాలని యోచి స్తోంది. మరోవైపు డిజిటల్ సేవలందిండం ద్వారా కొత్త తరం వినియోగదారులను ఆకట్టుకోవాలని చూస్తోంది. గురువారం జరిగిన కంపెనీ వ్యాపార ప్రణాళికలను విశ్లేషకులకు వివరించే సమావేశంలో కంపెనీ ఈడీ అన్మోల్ అంబానీ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో కంపెనీ చైర్మన్, అన్మోల్ తండ్రి అనిల్ అంబానీ, గ్రూప్ కంపెనీల ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా హాజరయ్యారు. 24 సంవత్సరాల అన్మోల్ అంబానీ గత ఏడాది ఈడీగా రిలయన్స్ క్యాపిటల్‌లో చేరారు.
మూడు నెలల్లో హోమ్ ఫైనాన్సింగ్ లిస్టింగ్
ప్రపంచంలో భారత్, చైనాలు పెద్ద డిజిటల్ మార్కెట్లని అన్మోల్ పేర్కొన్నారు. కొత్త తరం వినియోగదారులకు సేవలందించడానికి తమ వ్యాపారాలన్నింటినీ డిజిటలైజ్ చేయాలని యోచిస్తున్నామని వివరించారు. రిలయన్స్ గ్రూప్‌కు ఆర్థిక సేవల కంపెనీ కీలకమని, గ్రూప్‌లో అధిక వృద్ది ఉన్న వ్యాపారం ఇదని వివరించారు. కీలకం కాని ఆస్తుల విక్రయం జరుగుతోందని, వచ్చే మార్చి కల్లా భారీ స్థాయిలో మూలధన లాభాలు పొందగలమన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే మూడు నెలల్లో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లిస్టింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.
ఫండ్లలో పెట్టుబడులు పెరిగాయ్..
రెండున్నరేళ్లలో భారత్‌లో భారీ మార్పులు వచ్చాయని, రెడ్ టేపిజమ్(ప్రభుత్వ విధానాల్లో సుదీర్ఘ జాప్యం)పోయి రెడ్ కార్పెట్ వచ్చిందని, చాలా సంస్కరణలు వచ్చాయని, వ్యాపార విశ్వసనీయత పెరిగిందని అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. చౌక ధరల గృహాలు, సార్వత్రిక బీమా, చెల్లింపుల బ్యాంక్‌ల ఏర్పాటు, ఆధార్ వంటివన్నీ భారత్‌లో ఆర్థిక సేవల వృద్ధికి దోహదపడే కీలకాంశాలని వివరించారు.