ఎయిర్సెల్ విలీనం 15 రోజుల్లో: ఆర్కామ్
అధిక స్పెక్ట్రమ్ ఉన్న కంపెనీగా విలీన సంస్థ
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో ఎయిర్ సెల్ విలీనం దాదాపు పూర్తి కావచ్చింది. ఈ మేరకు ఎయిర్‌సెల్‌తో రెండు సార్లు చర్చలు జరిపామని, విలీన చర్చలు తుది దశకు చేరాయని, 10-15 రోజుల్లో ఎయిర్‌సెల్ విలీనాన్ని ప్రకటిస్తామని రిలయన్స్ కమ్యూనికేషన్స్ గురువారం వెల్లడించింది. ఎయిర్‌సెల్ వాటాదారులైన మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హాద్, సింధ్య సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని వీలైనంత త్వరలో కుదుర్చుకుంటామని పేర్కొంది.
ప్రభుత్వ సంస్థల, వాటాదారుల ఆమోదం పొం దాల్సి ఉందని వివరించింది. ఆర్‌కామ్‌లో ఎయిర్‌సెల్ విలీనమైతే, మొత్తం టెలికం పరిశ్రమకు కేటాయించిన స్పెక్ట్రమ్‌లో 19.3% ఈ విలీన సంస్థకు ఉంటుంది. దేశంలో ఇంత అధిక స్పెక్ట్రమ్ ఉండే కంపెనీ ఇదే. 2జీ, 3జీ, 4జీ సర్వీసులందజేయడానికి ఉపయోగపడే అన్ని రకాల బ్యాండ్‌ల స్పెక్ట్రమ్ ఈ సంస్థకు ఉంటుంది.
రూ.25వేల కోట్ల వ్యాపారం..
విలీనం పూర్తయిన తొలి రోజు నుంచే రూ.25వేల కోట్ల వ్యాపారం ఈ విలీన సంస్థకు ఉంటుందని అంచనా. ఈ విలీన సంస్థ ఇబిట(క్యాష్ ఫ్లో) రూ.7,000 కోట్లు, వడ్డీ వ్యయాలు రూ.3,000 కోట్లు ఉంటాయని అంచనా. మార్చి నాటికి ఆర్‌కామ్ నికర రుణ భారం రూ.41,362 కోట్లుగా ఉంది. కాగా విలీన వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఆర్‌కామ్ షేర్ 4.1 శాతం లాభపడి రూ.49.7 వద్ద ముగిసింది.