ముంబై : దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్ కామ్), ఎయిర్ సెల్ లు విలీనానికి సంబంధించి చర్చల గడువును మరో 30 రోజులు పొడిగించాయి. చర్చల గడువును పొడిగిస్తున్నట్టు రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీ ప్రకటించింది. ఈ విలీన చర్చల గడువును పొడిగించడం ఇది రెండోసారి. మొదటిసారి మార్చి 22న విలీన చర్చల గడువును 60 రోజులుకు పెంచుతున్నట్టు కంపెనీలు ప్రకటించాయి.
మరింత గణనీయమైన పురోగతి కోసం ఆర్ కామ్, మాక్సిస్ కమ్యూనికేషన్ బెర్హడ్(ఎమ్ సీబీ), సింద్యా సెక్యురిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ సెల్ పెట్టుబడిదారులు పరస్పరం ఈ ప్రత్యేక సమయ వ్యవధిని 2016 జూన్ 22 వరకు పెంచాలని నిర్ణయించినట్టు ఆర్ కామ్ తెలిపింది. అయితే ఈ విలీన ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. షేర్ హోల్డింగ్ గురించి ప్రస్తుత చర్చలు జరుగుతున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొత్త సంస్థలో ఆర్ కామ్ ఎక్కువ షేరును ఆశిస్తున్నట్టు సమాచారం.
ఆర్ కామ్ టవర్, ఆప్టికల్ ఫైబర్ ఆస్తులను వదిలేసి, విలీన చర్చలను 90 రోజుల ప్ర్యతేక సమయ వ్యవధితో ప్రారంభిస్తున్నట్టు డిసెంబర్ 22న ఈ కంపెనీలు ప్రకటించాయి. అయితే మార్చి 22న మరో 60 రోజులు ఈ విలీన చర్చల గడువును పొడిగిస్తున్నట్టు పేర్కొన్నాయి. ఆర్ కామ్, ఎయిర్ సెల్ చర్చలు సఫలమైతే, మొత్తం స్పెక్ట్రమ్ పరిశ్రమలో ఈ రెండు 19.3శాతం వాటాను కలిగి ఉంటాయి. 2జీ, 3జీ, 4జీ సర్వీసుల కొరుకు 800 ఎమ్ హెచ్ జడ్, 900ఎమ్ హెచ్ జడ్ ,1800ఎమ్ హెచ్ జడ్,2100ఎమ్ హెచ్ జడ్,2300 ఎమ్ హెచ్ జడ్ స్పెక్ట్రమ్ లను ఇవి పొందనున్నాయి.