
ఆర్‌కామ్ లాభం 86 శాతం వృద్ధి
* టెలికం సేవలపై మార్జిన్లు పెరిగాయ్
* వడ్డీ భారం తగ్గింది
ముంబై: టెలికం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 86 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.108 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్ ) ఈ క్యూ3లో రూ.201 కోట్లకు పెరిగిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తెలిపింది. టెలికం సేవలపై మార్జిన్లు పెరగడం, వడ్డీ భారం తగ్గడం వల్ల నికర లాభంలో భారీ వృద్ధి సాధించామని కంపెనీ సీఈఓ(కన్సూమర్ బిజినెస్)గుర్దీప్ సింగ్ పేర్కొన్నారు.
గత క్యూ3లో రూ.40,762 కోట్లుగా ఉన్న రుణ భారం ఈ క్యూ3లో 4,000 కోట్లు తగ్గి రూ.36,767 కోట్లకు క్షీణించిందని వివరించారు. తమ నెట్‌వర్క్‌లో డేటా వినియోగం 83 శాతం పెరిగిందని, ఇది పరిశ్రమలోనే అధికమని పేర్కొన్నారు. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.5,157 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.5,435 కోట్లకు పెరిగిందని వివరించారు. సీడీఎంఏ విభాగం ఆదాయం ఈ క్యూ3లో నిలకడను సాధించిందని పేర్కొన్నారు. జీఎస్‌ఎం ఆదాయం 4 శాతం పెరిగిందని వివరించారు.
గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి తమ వినియోగదారుల సంఖ్య 10.6 కోట్లకు పెరిగిందని చెప్పారు. మొబైల్ వినియోగదారుడి నుంచి సగటు రాబడి రూ.142కు వృద్ధి చెందిందన వివరించారు. గత క్యూ3లో 44.4 పైసలుగా ఉన్న నెట్‌వర్క్ ఆదాయం (నిమిషానికి) ఈ క్యూ3లో 45.2 పైసలకు పెరిగిందని వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఆర్‌కామ్ షేర్ బీఎస్‌ఈలో 1.3 శాతం వృద్ధితో రూ.72 వద్ద ముగిసింది.