
ముంబై: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) రుణ పరపతికి సంబంధించి భవిష్యత్తు అంచనా(క్రెడిట్ అవుట్‌లుక్)ను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ తగ్గించింది. ప్రస్తుతం ఉన్న సానుకూలం(పాజిటివ్) నుంచి స్థిరం (స్టేబుల్) స్థాయికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఆర్‌ఐఎల్ రేటింగ్‌ను మాత్రం యథాతథంగా ‘బీఏఏ2’ స్థాయిలోనే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.
వచ్చే 18 నెలల్లో రిలయన్స్ భారీ మొత్తంలో రుణాలను తిరిగిచెల్లించాల్సిన నేపథ్యంలో కంపెనీ నగదు ప్రవాహంపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్న కారణంతోనే క్రెడిట్ అవుట్‌లుక్‌ను తగ్గించినట్లు మూడీస్ పేర్కొంది. ‘టెలికం, రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారాల విస్తరణ కోసం గడిచిన కొన్నేళ్లలో రుణాలు, బాండ్ల జారీ ద్వారా రిలయన్స్ భారీగా నిధులను సమీకరించింది. వీటిలో చాలావరకూ వచ్చే 18 నెలల్లో రుణదాతలకు తిరిగి చెల్లించాల్సి ఉంది.
దీనివల్ల కంపెనీ నుంచి నగదు భారీగా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. రిలయన్స్ ఇప్పటికే అతిపెద్ద విదేశీ రుణ గ్రహీతగా కొనసాగుతోంది. విదేశీ రుణాలను మరింతగా సమీకరించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల రుణ భారం తగ్గకపోగా... కంపెనీ నుంచి నగదు ప్రవాహాలు పెరుగుతాయి’ అని మూడీస్ హెచ్చరించింది. సెప్టెంబర్ చివరినాటికి రిలయన్స్ నగదు నిల్వలు రూ.77,014 కోట్లు కాగా, రుణ భారం రూ.2,14,145 కోట్లకు పెరిగింది. మరోపక్క, షేరు ధర కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలకు ఎగబాకడంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.6 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది.