రిలయన్స్ ఎంటర్టైన్మెంట్లో వాటా కొన్న టాంగ్ మీడియా పార్ట్‌నర్స్
ముంబై: అనిల్ అంబానీ రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్‌కు చెందిన ఫిల్మ్, టీవీ స్టూడియో, ఐఎం గ్లోబల్‌లో మెజారిటీ వాటాను టాంగ్ మీడియా పార్ట్‌నర్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇక కొత్త టీవీ ప్రొడక్షన్ జాయింట్ వెంచర్ కోసం టాంగ్ మీడియా, ఐఎం గ్లోబల్ కంపెనీలు కలిసి ఆసియా ఇంటర్నెట్ దిగ్గంజ టెన్సెంట్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా..ఈ కంపెనీలు టీవీ ప్రసారాల కంటెంట్ , టీవీ ప్రోగ్రామ్‌లు, సినిమాల కోసం, డిస్ట్రిబ్యూషన్, అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫార్మ్ విస్తరణ కోసం పెట్టుబడులు పెడతాయి.
ఐఎం గ్లోబల్ సంస్థకు, కొత్తగా ఏర్పాటు చేసిన టీవీ ప్రొడక్షన్ జాయింట్ వెంచర్‌కు కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా స్టువర్ట్ ఫోర్డ్ వ్యవహరిస్తారు. ఐఎం గ్లోబల్ టెలివిజన్‌కు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మార్క్ స్టెర్న్ అదే పదవిలో కొనసాగుతారు. వినూత్నమైన వినోదాత్మకమైన కంటెంట్ డెవలప్‌మెంట్, దీనికి కావలసిన నిధుల సమకూర్చడం, పంపిణి తదితర రంగాల్లో లాస్ ఏంజెల్స్, షాంఘై కేంద్రాలుగా టాంగ్ మీడియా పార్ట్‌నర్స్ కార్యకలాపాలు సాగిస్తోంది. టాంగ్ పార్ట్‌నర్స్ వాటా కొనుగోలు కారణంగా తమకు చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు సమకూరుతాయని ఐఎం గ్లోబల్ సీఈఓ స్టువర్ట్ ఫోర్డ్ పేర్కొన్నారు. 2007లో ఫోర్డ్‌చే ప్రారంభించిన ఐఎం గ్లోబల్ సంస్థ.. ప్రపంచ అగ్రశ్రేణి ఫిల్మ్, టెలివిజన్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫార్మ్‌ల్లో ఒకటి.