సౌత్ ఇండియాలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'కంగువ'. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్ కీలకపాత్రలు చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా ఈ సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టారు. అయితే, ఈ సినిమా విడుదల విషయంలో పలు అడ్డంకులు వచ్చేలా కనిపిస్తున్నాయి. రిలయన్స్ నిర్మాణ సంస్థ ఫిర్యాదుతో కంగువ సినిమా రిలీజ్ విషయంలో మద్రాస్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
3డీ ఫార్మెట్‌లో 10 భాషల్లో నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుందని అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, ఈ సినిమా నిర్మాత కేఈ.జ్ఞానవేల్ రాజా, రిలయన్స్ సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీల చిక్కులు ఉన్నాయి. స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ తరపున టెడ్డీ-2, ఎక్స్ మీట్స్ ఓయ్, తంగలాన్ చిత్రాల నిర్మాణం కోసం రిలయన్స్ నుంచి రూ.99 కోట్లు పైగానే జ్ఞానవేల్ రాజా రుణం పొందారు. అయితే, ఇప్పటికే రూ.45 కోట్లు తిరిగి చెల్లించిన జ్ఞానవేల్ రాజా మిగిలిన రూ.55 కోట్లు చెల్లించకుండా కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని రిలయన్స్ తరపున మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలైంది.
తమకు చెల్లించాల్సిన డబ్బు అందేవరకు సూర్య నటించిన గంగువ సినిమా విడుదలను ఆపేయాలని రిలయన్స్ నిర్మాణ సంస్థ కోర్టుకెళ్లింది. మరోవైపు తంగళాన్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయకూడదని ఆ పిటిషన్‌లో పేర్కొంది. జస్టిస్ కుమారేష్ బాబు ముందు కేసు విచారణకు వచ్చినప్పుడు, స్టూడియో గ్రీన్ ఇలా తెలిపింది. 'నవంబర్ 7 వరకు సమయం కావాలని కోరింది. అప్పటి వరకు 'కంగువ'ను విడుదల చేయబోమని తెలిపింది.
ఈ క్రమంలో తంగలాన్ చిత్రాన్ని కూడా నవంబర్ 7వరకు విడుదల చేయబోమని హామీ ఇచ్చింది. దీనిని నమోదు చేసుకున్న న్యాయమూర్తి కేసు విచారణను నవంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు. అయితే, కంగువ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది. ఆ సమయంలోపు ఈ కేసు క్లియర్ కాకపోతే సినిమా విడుదలకు చిక్కులు తప్పవని ఇండస్ట్రీ వర్గాలే పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment