మళ్లీ రిలయన్స్‌ రికార్డ్‌! | Reliance recorded a net profit of Rs 11640 crore | Sakshi
Sakshi News home page

మళ్లీ రిలయన్స్‌ రికార్డ్‌!

Published Sat, Jan 18 2020 1:50 AM | Last Updated on Sat, Jan 18 2020 1:50 AM

Reliance recorded a net profit of Rs 11640 crore - Sakshi

ముంబై/న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రికార్డ్‌ స్థాయిలో రూ.11,640 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత క్యూ3లో రూ.10,251 కోట్ల నికర లాభం వచ్చిందని, 14% వృద్ధి సాధించామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది.  భారత్‌లో ఒక ప్రైవేట్‌ కంపెనీకి ఒక త్రైమాసిక కాలంలో ఇదే అత్యధిక నికర లాభం కావడం గమనార్హం. చమురు శుద్ధి వ్యాపారం లాభాల బాట పట్టడం, కన్సూమర్‌ వ్యాపారాలైన రిలయన్స్‌ రిటైల్, జియోల జోరు కొనసాగడంతో  నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది.  ఇక ఆదాయం మాత్రం 1.4% క్షీణించి రూ.1,68,858 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. కాగా, క్యూ2(సెప్టెంబర్‌ క్వార్టర్‌) లోనూ రిలయన్స్‌ రికార్డు స్థాయిలోనే లాభాలను ఆర్జించింది.

వినియోగ వ్యాపారాలు... వాహ్వా !  
కంపెనీ కన్సూమర్‌ వ్యాపార విభాగాలైన రిలయన్స్‌ రిటైల్, రిలయన్స్‌ జియోల జోరు కొనసాగుతోంది. ఈ రెండు వ్యాపారాల స్థూల లాభం రికార్డ్‌ స్థాయిలో పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం నిర్వహణ లాభంలో ఈ రెండు విభాగాల వాటా 25 శాతంగానే ఉంది. ఈ క్యూ3లో ఈ వాటా దాదాపు 40 శాతానికి పెరిగింది. గత క్యూ3లో రూ.1,680 కోట్లుగా ఉన్న రిలయన్స్‌ రిటైల్‌ నిర్వహణ లాభం ఈ క్యూ3లో  62 శాతం వృద్ధితో రూ.2,727 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.35,577 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.45,327 కోట్లకు పెరిగింది.ఈ క్యూ2లో 10,901గా ఉన్న మొత్తం రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్స్‌ సంఖ్య ఈ క్యూ3లో 11,316కు పెరిగాయి. రిటైల్‌ రంగంలో ఇతర కంపెనీల కన్నా కూడా రిలయన్స్‌ రిటైల్‌ కంపెనీయే జోరుగా వృద్ధి చెందుతోంది. సగటున 17.6 కోట్ల మంది వినియోగదారులు రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్స్‌ను సందర్శిస్తున్నారు. ఇది గత క్యూ3 కంటే 43 శాతం అధికం.   

మరిన్ని వివరాలు.... 
- వరుసగా 6 క్వార్టర్ల పాటు తగ్గుతూ వచ్చిన రిఫైనింగ్‌ మార్జిన్లు ఈ క్యూ3లో పెరిగాయి. ఈ విభాగం స్థూల లాభం 12% వృద్ధితో రూ.5,657 కోట్లకు చేరింది.  
గత క్యూ3లో 8.8 డాలర్లుగా ఉన్న స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌(జీఆర్‌ఎమ్‌–ఒక్కో బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చినందువల్ల లభించే లాభం)ఈ క్యూ3లో 9.2 డాలర్లకు పెరిగింది. అయితే ఈ క్యూ2లో వచ్చిన దాంతో(9.4 డాలర్లు) పోల్చితే ఇది తక్కువే.  
రికార్డ్‌ స్థాయిలో (9.9 మిలియన్‌ టన్నులు) చమురును ఉత్పత్తి చేసినప్పటికీ, ఈ విభాగం స్థూల లాభం 29 శాతం తగ్గి రూ.5,880 కోట్లకు పరిమితమైంది. ఇక చమురు, గ్యాస్‌ అన్వేషణ, ఉత్పత్తి విభాగం నష్టాలు రూ.185 కోట్ల నుంచి రూ.366 కోట్లకు పెరిగాయి.  
క్యూ2లో రూ.2,91,982 కోట్లుగా ఉన్న రుణ భారం క్యూ3 చివరికి రూ.3,06,851 కోట్లకు పెరిగింది. నగదు నిల్వలు రూ.1,34,746 కోట్ల నుంచి రూ.1,53,719 కోట్లకు చేరాయి.
మార్కెట్‌ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై ఆశావహ అంచనాలతో బీఎస్‌ఈలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 2.8 శాతం లాభంతో రూ.1,581  వద్ద ముగిసింది. 

జియో... జిగేల్‌... 
ఇక టెలికం విభాగం రిలయన్స్‌ జియో జోరు కొనసాగుతోంది. గత క్యూ3లో రూ.831 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో  63 శాతం వృద్ధితో రూ.1,350 కోట్లకు పెరిగింది. నిర్వహణ ఆదాయం రూ.10,884 కోట్ల నుంచి 28 శాతం వృద్ధితో రూ.13,968 కోట్లకు పెరిగింది. మొత్తం మొబైల్‌ వినియోగదారుల సంఖ్య 37 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుడి పరంగా వచ్చే నగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) ఈ క్యూ2లో నెలకు రూ.120గా ఉండగా, ఈ క్యూ3లో రూ.128.4కు పెరిగింది. ఈ విభాగం త్రైమాసిక నిర్వహణ లాభం తొలిసారిగా రూ.5,600 కోట్ల మైలురాయిని దాటింది. డేటా ట్రాఫిక్‌ 40 శాతం, వాయిస్‌ కాల్స్‌ 30 శాతం చొప్పున వృద్ధి చెందాయి. 

రికార్డ్‌లే రికార్డ్‌లు...
ప్రతి త్రైమాసిక కాలంలో కన్సూమర్‌ వ్యాపారాలు రికార్డ్‌ల మీద రికార్డ్‌లను సృష్టిస్తున్నాయి. రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్స్‌లో అమ్మకాలు నిలకడగా పెరుగుతున్నాయి. ఇక అత్యంత చౌక ధరలకే సేవలందిస్తుండటంతో రిలయన్స్‌ జియో  దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా ఆర్థిక స్థితిగతులు బలహీనంగా ఉండటం, ఇంధన మార్కెట్లలో ఒడిదుడుకులు చోటు చేసుకోవడం... ఇంధన వ్యాపారంపై ప్రభావం చూపించాయి. పటిష్ట వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా రిఫైనింగ్‌ సెగ్మెంట్‌ పనితీరు మెరుగుపడింది.  
–ముకేశ్‌ అంబానీ, సీఎమ్‌డీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement