రీమోనిటైజేషన్ పూర్తయ్యింది..
నోట్ల రద్దు అనంతర పరిస్థితిపై అరుణ్‌జైట్లీ
రాంచీ: పెద్ద నోట్ల అనంతరం నెలకొన్ని ద్రవ్య కొరత సమస్య
దాదాపు తొలగిపోయిందనీ, రీమోనిటైజేషన్ (నగదును అందుబాటులోకి తీసుకురావడం) ప్రక్రియ దాదాపు పూర్తయ్యిందనీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం పేర్కొన్నారు. రోజూవారీ నగదు సరఫరా పరిస్థితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జాగ్రత్తగా పరిశీలిస్తోందని కూడా జైట్లీ వివరించారు. నల్లధనం నిరోధం, తీవ్రవాదులకు నిధులు అందకుండా చేయడం, నగదు లావాదేవీల డిజిటలైజేషన్ వంటి లక్ష్యాలను ఉద్దేశించి నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో నగదు లభ్యత సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జార్ఖండ్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న ఆర్థికమంత్రి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైనవి...
⇔ నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థతో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. నేరాలు పెరగడానికి, పన్నులు ఎగవేయడానికి నగదు ఆధారిత వ్యవస్థ దోహదపడుతుందనీ విశ్లేషించారు.
⇔ దేశంలో ప్రస్తుత వాణిజ్య, వ్యాపార విధానాలు మారాలని ఆయా అంశాలు మరింత సరళతరం కావాల్సి ఉందని విశ్లేషించారు.
⇔ నోట్ల రద్దు అనంతరం బ్యాంకులకు ఆయా నోట్ల డిపాజిట్లు ఎంత మొత్తంలో జరిగాయన్న ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, ‘‘కరెన్సీ లెక్కింపు ప్రక్రియ ఆసాంతం పూర్తయిన తర్వాతే సంబంధిత డిపాజిట్ల మొత్తాన్ని వెల్లడించడం జరుగుతుంది’’ అని ఇటీవలే ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు.
నోట్ల రద్దుతో వృద్ధి పెరుగుతుంది: ఆర్థికశాఖ
ఇదిలావుండగా, పెద్ద నోట్ల రద్దుతో ఆర్థికవృద్ధి మరింత పెరుగుతుందని ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో 23 శాతం ‘‘షాడో ఎనాకమీ’గా ఉందని, పేర్కొన్న ఆయన, నోట్ల రద్దు, డిజిటలైజేషన్ చొరవల వల్ల ఇక ముందు పన్ను చెల్లింపుల పరిధి మరింత విస్తరిస్తుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో నగదు నిష్పత్తి 4 శాతం ఉంటే, భారత్‌లో ఏకంగా 12 శాతంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రధాని మోదీ నవంబర్ 8 పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చొరవతో ప్రజలు డిజిటల్ ఆర్థిక లావాదేవీలవైపు అడుగులు వేస్తున్నారని అన్నారు.