భారీ పన్ను వసూళ్లు..!
నోట్ల రద్దు ప్రభావం లేదని చెబుతున్నాయ్
• ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విశ్లేషణ
• వృద్ధి వేగం తగ్గుతుందన్నది అపోహేనన్న అభిప్రాయం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిపై రూ.500, రూ.1,000 నోట రద్దు ప్రభావం ఎంతమాత్రం లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం మరోసారి విశ్లేషించారు. డిసెంబర్‌లో పరోక్ష పన్ను వసూళ్లలో భారీగా 14.2% (రూ.76 వేల కోట్లు) వృద్ధి నమోదయ్యిందని ఆయన పేర్కొంటూ, తయారీ రంగం పురోభివృద్ధి, తద్వారా ఎక్సైజ్ సుంకాల మెరుగుదలను ఈ చక్కటి వసూళ్లు సూచిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికమంత్రి వెల్లడించిన అంశాల్లో ముఖ్యమైనవి...
⇔ డిసెంబర్‌లో పరోక్ష పన్నుల వసూళ్లను వేర్వేరుగా చూస్తే... ఎక్సైజ్ వసూళ్లు 31.6% (రూ.36,000 కోట్లు) పెరిగాయి. సేవల పన్ను వసూళ్లలో వృద్ధి 12.4%(రూ.23,000 కోట్లు). అయితే కస్టమ్స్‌లో మాత్రం అసలు వృద్ధిలేకపోగా 6.3% క్షీణించింది. పసిడి దిగుమతులు పడిపోవడమే దీనికి కారణం.
⇔ ఏప్రిల్–డిసెంబర్ కాలంలో చూస్తే... పరోక్ష పన్ను వసూళ్లు 25% వృద్ధితో రూ.6.30 లక్షల కోట్లకు చేరాయి. బడ్జెట్ అంచనాల్లో ఇది 81%. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.01 శాతం ఎగసి, రూ.5.53 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాలో ఇది 65 శాతం.
⇔ డీమోనిటైజేషన్ అనంతరం ఉపాధి అవకాశాలు తగ్గాయన్న వార్తలు అన్నీ వాస్తవ ప్రాతిపదికతో కూడినవి కావు. వృద్ధి అంకెలు... ఇలాంటి ఊహాజనిత ప్రాతిపదికలను సమర్థించడం లేదు. పన్నులు, ఆయా గణాంకాలే వాస్తవం.
⇔ ఇక చాలా రాష్ట్రాల్లో వ్యాట్ వసూళ్లు నవంబర్‌లో కూడా పెరిగాయి.
⇔ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంకెలు, పన్ను వసూళ్ల అంకెలకు పొంతన కుదరడం లేదనడం సరికాదు. జీడీపీపై ఇప్పుడు వచ్చింది ముందస్తు అంచనాలు మాత్రమే. తుది గణాంకాలపై మాత్రమే మనం స్పందించాల్సి ఉంటుంది.