పన్ను వసూళ్లు పెరిగాయ్‌.. | Demonetisation impact: Double-digit growth in India's tax collection | Sakshi
Sakshi News home page

పన్ను వసూళ్లు పెరిగాయ్‌..

Published Fri, Dec 30 2016 12:51 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

పన్ను వసూళ్లు పెరిగాయ్‌.. - Sakshi

పన్ను వసూళ్లు పెరిగాయ్‌..

ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ నోట్ల రద్దుతో ప్రతికూల ప్రభావం లేదు

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రతికూలత ఆర్థిక వ్యవస్థలో ప్రతిబింబించడం లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. భారీగా పన్ను వసూళ్లే ఈ ఆరోపణలను తోసిపుచ్చేవిగా ఉన్నాయని అన్నారు. ఈ మేరకు ఒక వార్తాసంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వూ్యలో ముఖ్యాంశాలు...

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి డిసెంబర్‌ 19 మధ్య ప్రత్యక్ష పన్నులతో ప్రభుత్వ ఖజానాకు రూ.5.57 లక్షల కోట్లు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాల్లో ఇది 65%.

♦  ఇక ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య కస్టమ్స్, ఎక్సైజ్, సేవల పన్నులతో కూడిన పరోక్ష పన్నుల వసూళ్లు 26.2 శాతం వృద్ధితో 7.53 లక్షల కోట్లకు ఎగశాయి.

డీమోనిటైజేషన్‌ నవంబర్‌లో జరిగింది. పారిశ్రామిక క్రియాశీలత మందగించిందనీ విమర్శలు వచ్చాయి.  అయితే ఈ నెలలోనే  పరోక్ష పన్ను వసూళ్లు 23.1 శాతం వృద్ధితో రూ.67,358 కోట్లకు చేరాయి. మొత్తం మూడు విభాగాల్లో మంచి పరిమాణంలో వసూళ్లు జరిగాయి. కస్టమ్స్‌ వసూళ్లు 16.1 శాతం వృద్ధితో రూ.20,510 కోట్లకు ఎగశాయి. ఎక్సైజ్‌ వసూళ్లు 33.7 శాతం వృద్ధితో రూ.29,664 కోట్లకు చేరాయి. సేవల పన్ను వసూళ్లు 15.5 శాతం వృద్ధితో రూ.17,178 కోట్లకు చేరాయి.

ఈ ఏడాది ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 12.64% వృద్ధితో రూ.8.47 లక్షల కోట్లుగా ఉండాలని, పరోక్ష పన్ను వసూళ్లు 10.8% వృద్ధితో రూ.7.79 లక్షలకు చేరాలని ప్రభుత్వం కోరుకుంటోంది. లక్ష్యాలను సాధిస్తామన్న విశ్వాసముంది.

ఎంతో అసౌకర్యం ఉంటుందని తెలిసినా... కీలక నిర్ణయం తీసుకుంటున్నందున ప్రజలు సహరించాలని డీమోనిటైజేషన్‌ సందర్భంగా నవంబర్‌ 8న ప్రధాని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి తగిన మద్దతు లభించినందుకు ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంటుంది.
దేశంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనా చోటుచేసుకోలేదు.  

డీమోనిటైజేషన్‌తో పెద్దఎత్తున డబ్బు బ్యాంకింగ్‌లోకి వచ్చింది. పన్నులు, రెవెన్యూ వసూళ్ల రూపంలో ఇది ఇప్పటికే కనిపిస్తోంది. బ్యాంకింగ్‌ సామర్థ్యం  మరింత మెరుగుపడింది.

రబీ సాగు బాగుంది. బీమా వ్యాపారం, అంతర్జాతీయ టూరిజం, పెట్రోలియం వినియోగం, మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి నిధులు... ఇలా పలు అంశాలు సానుకూలంగా ఉన్నాయి.


డీమోనిటైజేషన్‌ నేపథ్యంలో.. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని వ్యవస్థలో కరెన్సీ సర్క్యులేషన్‌పై ఆర్‌బీఐ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆర్థిక వ్యవస్థను సాధ్యమైనంత విస్తృత స్థాయిలో ‘క్యాష్‌లెస్‌’గా మారాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

ధరలు, పన్ను రేట్లు పెరగడంవల్లే..
పలు ప్రతికూలతలు ఉన్నా... పన్ను వసూళ్లు పెరుగుదలకు కారణాలేమిటన్న విషయంపై ఆర్థిక విశ్లేషకులు దృష్టి సారిస్తున్నారు.క్రూడ్, పెట్రోలియం ఉత్పత్తులు, బంగారం వంటి కమోడిటీల ధరలు పెరగడం, 2016–2017 బడ్జెట్లో కొన్ని ఉత్పత్తులు, సర్వీసుల పన్ను రేట్లు పెరగడం పన్ను వసూళ్ల పెరుగుదలకు ప్రధాన కారణమని, అంతేగానీ ఆర్థిక వ్యవస్థ పనితీరు బేషుగ్గా వుండటం కాదనేది వారి అభిప్రాయం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో. బీడీలు మినహా పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం 10% నుంచి 15%కి పెరిగింది.  రూ.10 లక్షలపైన కారు కొనుగోలు, రూ. 2 లక్షలకు పైన గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ కొనుగోళ్లపై 1% సర్వీస్‌ చార్జీ విధించింది. వెండి మినహా ఆభరణాలపై 1% ఎక్సైజ్‌ సుంకం విధింపు వంటి అంశాలు పన్ను వసూళ్ల వృద్ధికి దోహదపడ్డాయి.


ప్రభుత్వం మొదటి విడతగా ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కింద ఇటీవలే మొదటి విడత పన్ను చెల్లింపులు ప్రభుత్వ ఖజానాకు అందాయి. దాదాపు రూ. 7వేల కోట్లుగా ఇది అంచనా.  మొత్తం 45 శాతం పన్నుతో జూన్‌ నుంచి  సెప్టెంబర్‌ వరకూ మొదటి విడత ఆదాయ వెల్లడి పథకం అమలయ్యింది. ఈ స్కీము ద్వారా వచ్చిన అదనపు వసూళ్లతో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పెరిగాయి.


ఇక ఎక్సైజ్, కస్టమ్స్‌ పన్ను వసూళ్లలో క్రూడ్‌ ధరల పెరుగుదల  కీలకమైంది. ఈ ధరల పెరుగుదల కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై వసూలుచేసే కస్టమ్స్‌ వసూళ్లు, దేశీయంగా ఈ ఉత్పత్తుల విక్రయాల ద్వారా సమకూరే ఎక్సైజ్‌ వసూళ్లు పెరిగాయి.

పసిడి విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. దిగుమతి సుంకాలు పెరుగుదలకు ఇది దోహదపడింది.

ఇక డీమోనిటైజేషన్‌ కారణంగా పన్నుల వసూళ్ల రూపంలో సానుకూలతలు నమోదయినట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీనే స్వయంగా పేర్కొంటున్నారు. అంటే రద్దయిన నోట్లతో పాత బకాయిలు చెల్లింపులు పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement