
రిటైల్ ద్రవ్యోల్బణం.. రికార్డు కనిష్టం!
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో రికార్డు కనిష్ట స్థాయిలను నమోదుచేసుకుంది
జూలైలో 3.78 శాతం
న్యూఢిల్లీ : వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో రికార్డు కనిష్ట స్థాయిలను నమోదుచేసుకుంది. గతేడాది ఇదేనెలతో పోలిస్తే ద్రవ్యోల్బణం రేటు 7.39 శాతం నుంచి 3.78 శాతానికి తగ్గింది. అంటే 2014 జూలై ధరలతో పోల్చితే 2015 జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం బాస్కెట్ ధర కేవలం 3.78 శాతం పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణం సూచీని ప్రవేశపెట్టిన దాదాపు రెండున్నరేళ్లలో ఈ స్థాయిలో రిటైల్ ధరల పెరుగుదల ఇంత తక్కువ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలుసహా పలు ఆహార ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండడం దీనికి కారణం. 2015 జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంది. గత ఏడాది జూలైలో ఈ రేటు 7.39 (2013 జూలైతో పోల్చితే) శాతంగా ఉంది. ముఖ్యాంశాలు చూస్తే...
► ఒక్క ఆహార ఉత్పత్తుల ధరలను చూస్తే... ఈ రేటు 2015 జూన్‌తో పోల్చితే 5.48 శాతం నుంచి 2.15 శాతానికి పడింది.ఆహారం ఉత్పత్తుల్లో ధరలు వేర్వేరుగా చూస్తే, కూరగాయలు, చక్కెర-తీపి ఉత్పత్తుల ధరలు జూలైలో వార్షిక ప్రాతిపదికన తగ్గాయి. కూరగాయల ధరలు -8%, చక్కెర, తీపి పదార్థాల ధరలు 12% క్షీణించాయి.
► పప్పు ధాన్యాల ధరలు 23% ఎగశాయి.
► తృణధాన్యాలు (1%), మాంసం, చేపలు (7%), గుడ్లు (3%), చమురు, వెన్న పదార్థాలు (3%), పండ్లు (1.5%), సుగంధ ద్రవ్యాలు (9%), ఆల్కాహాలేతర పానీయాలు (4%), ప్రె పేర్డ్ మీల్స్ (8%) ధరలు స్వల్పంగా పెరిగాయి.