
దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్టానికి ఎగిసింది. ఆహార, ఇంధన ధరలు బాగా పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినట్టు వెల్లడైంది. అక్టోబర్ నెలలో ఈ ద్రవ్యోల్బణ 3.58 శాతానికి పెరిగింది. సీఎన్‌బీసీ-టీవీ18 పోల్ ఈ ద్రవ్యోల్బణం 3.2-3.8 శాతం మధ్య ఉంటుందని అంచనావేసింది. వినియోగదారుల ధరల సూచీ ద్వారా ఈ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని గణిస్తారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రేట్ల కోతకు రిటైల్ ద్రవ్యోల్బణం ముఖ్యమైనది. ఈ ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటుంది. డిసెంబర్ 6న ఆర్‌బీఐ పాలసీ మీటింగ్ జరుగనుంది.
అయితే జీఎస్టీ కౌన్సిల్ 178 ఉత్పత్తుల ధరలను 28 శాతం నుంచి 18 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల వచ్చే నెలల్లో ఈ రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గే అవకాశాలున్నాయని పలువురు విశ్లేషకులు అంచనావేస్తున్నారు. జూన్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. అదేవిధంగా హౌసింగ్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. సెప్టెంబర్‌లో 6.1 శాతంగా ఉన్న హౌసింగ్ ద్రవ్యోల్బణం 6.68 శాతానికి ఎగిసింది. కాగ, అంచనావేసిన దానికంటే స్వల్పంగా వార్షిక పారిశ్రామికోత్పత్తి పెరిగింది. సెప్టెంబర్‌లో ఈ ఉత్పత్తి 3.8 శాతం పెరిగినట్టు తెలిసింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం వార్షిక పారిశ్రామికోత్పత్తి 4.2 శాతం పెరుగుతుందని రాయిటర్స్ పోల్‌లో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment