ముంబై : డిసెంబర్ క్వార్టర్‌లో కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ప్రోత్సాహకర త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ కాలంలో ఆర్‌ఐఎల్ నికర లాభం అత్యధికంగా 13.5 శాతం వృద్ధితో రూ 11,640 కోట్లు ఆర్జించింది. కన్జ్యూమర్ వ్యాపారంలో మెరుగైన నిర్వహణ సామర్థ్యం కనబరిచింది. ఇక ఈ త్రైమాసంలో కన్సాలిడేటెడ్ ఫలితాలను పరిశీలిస్తే ఆదాయం 1.4 శాతం తగ్గి రూ 1,68,858 కోట్లుగా నమోదైంది. పన్నుకు ముందు లాభాలు 3.6 శాతం పెరిగి రూ 14,962 కోట్లు కాగా నికర లాభం అత్యధికంగా 13.5 శాతం వృద్ధితో రూ 11,640 కోట్లుగా నమోదయ్యాయి. మూడో క్వార్టర్‌లో తమ ఇంధన వ్యాపారంపై గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ల అనిశ్చితి, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావం కనిపించిందని, అయితే రిఫైనింగ్ విభాగంలో మెరుగైన సామర్ధ్యం కనబరిచామని ఆర్థిక ఫలితాలపై ఆర్‌ఐఎల్ సీఎండీ ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. మరోవైపు కన్జూమర్ వ్యాపారాలు ప్రతి క్వార్టర్‌లో నూతన మైలురాళ్లను నెలకొల్పుతూ పురోగతి సాగిస్తున్నాయని అన్నారు.
కొనసాగిన జియో జోష్..
దేశంలో 4జీ దిశగా మార్పునకు వేగంగా అడుగులు వేస్తూ జియో డిసెంబర్ త్రైమాసంలో అన్ని విభాగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరిచింది. మూడవ క్వార్టర్‌లో అదనంగా 3.7 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు జియో నెట్‌వర్క్‌కు తోడయ్యారు. ఆదాయం రూ 13,968 కోట్లకు పెరగడంతో నికర లాభం గత క్వార్టర్‌తో పోలిస్తే 36.4 శాతం వృద్ధితో రూ 13.50 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాలపై ఆర్‌ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ మెరుగైన మొబైల్ కనెక్టివిటీ సేవలతో కస్టమర్లను ఆకర్షిస్తూ జియో తన విజయవంతమైన ప్రస్ధానం కొనసాగిస్తోందని అన్నారు. అందుబాటైన ధరలో ప్రజలకు అసాధారణ డిజిటల్ అనుభూతిని అందించడంపై జియో దృష్టిసారిస్తుందని చెప్పారు. డిమాండ్‌కు అనుగుణంగా నెట్‌వర్క్ సామర్ధ్యాలను ఆధునీకరిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment