దేశ కార్పొరేట్ చరిత్రలో కొత్త రికార్డును లిఖిస్తూ అతితక్కువ సమయంలోనే రూ. 1.15 లక్షల కోట్లను సమీకరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ తాజాగా సౌదీ అరామ్‌కో డీల్‌పై దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. విదేశీ చమురు దిగ్గజం సౌదీఅరామ్‌కోతో చర్చలు చేపట్టడం ద్వారా భాగస్వామ్యానికి తెరతీసే ప్రణాళికలను గతేడాదిలోనే ఆర్‌ఐఎల్ ప్రకటించింది. ఆర్‌ఐఎల్‌కు చెందిన చమురు, కెమికల్స్ విభాగంలో మైనారిటీ వాటా విక్రయం ద్వారా 15 బిలియన్ డాలర్లను సమకూర్చుకునేందుకు ముకేశ్ గతంలోనే ప్రణాళికలు వేశారు. నిజానికి ఈ ఏడాది(2020) మార్చికల్లా డీల్ కుదుర్చుకోవాలని ఆర్‌ఐఎల్ తొలుత భావించింది. కోవిడ్-19 కారణంగా ఒక దశలో చమురు ధరలు కుప్పకూలడంతో డీల్ ఆలస్యమైనట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అయితే డీల్‌ను పూర్తిచేసే అంశంపై ప్రస్తుతానికి ఎలాంటి గడువునూ కంపెనీ వెల్లడించలేదు. సౌదీ అరామ్‌కోతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకునే సన్నాహాల్లో ఉన్నట్లు గతేడాది నిర్వహించిన వార్షిక సమావేశంలో ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు తెలియజేశారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోగల రెండు రిఫైనరీలతోపాటు.. పెట్రోకెమికల్ ఆస్తులను కలిపి ఓ2సీగా విడదీయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంధన రిటైలింగ్ బిజినెస్‌లో 51 శాతం వాటా సైతం ఓ2సీలో భాగంకానున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అరామ్‌కోకు ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) బిజినెస్‌లో 20 శాతం వాటాను విక్రయించేందుకు ఆర్‌ఐఎల్ సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే.
జియోతో ఊపు
ఇటీవల డిజిటల్, టెలికం విభాగం రిలయన్స్ జియోలో 25 శాతం వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ ఆర్‌ఐఎల్ రూ. 1.15 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే. మరోవైపు రూ. 53,000 కోట్ల విలువగల రైట్స్ ఇష్యూ చేపట్టడం ద్వారా సైతం నిధులను సమకూర్చుకుంది. తద్వారా ఆర్‌ఐఎల్ రుణరహిత కంపెనీగా ఆవిర్భవించింది కూడా. ఈ బాటలో తాజాగా సౌదీ అరామ్‌కోతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా ఓ2సీ బిజినెస్‌కు సైతం జోష్‌నిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓ2సీ బిజినెస్ ఎంటర్‌ప్రైజ్ విలువను విశ్లేషకులు 75-65 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. దీంతో 20 శాతం వాటాకుగాను 15-13 బిలియన్ డాలర్లమేర ఆర్‌ఐఎల్ సమకూర్చుకునే వీలున్నట్లు ఊహిస్తున్నారు. కాగా.. కంపెనీ ఈ ఏడాది సాధారణ వార్షిక సమావేశాన్ని(ఏజీఎం) వర్చువల్ పద్ధతిలో జులై 15న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment