రిలయన్స్ లాభం 6,222 కోట్లు | Reliance profit 6.222 million | Sakshi
Sakshi News home page

రిలయన్స్ లాభం 6,222 కోట్లు

Published Sat, Jul 25 2015 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

రిలయన్స్ లాభం 6,222 కోట్లు

రిలయన్స్ లాభం 6,222 కోట్లు

క్యూ1లో 4 శాతం వృద్ధి..
♦ ఆదాయం రూ.83,064 కోట్లు;23 శాతం తగ్గుదల
♦ స్టాండెలోన్ లాభం ఏడున్నరేళ్ల గరిష్ట స్థాయి; రూ.6,318 కోట్లు...
♦ ఆరేళ్ల గరిష్టానికి రిఫైనింగ్ మార్జిన్లు; 10.4 డాలర్లుగా నమోదు...
 
 న్యూఢిల్లీ : దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) జూన్ క్వార్టర్(2015-16, క్యూ1)లో రూ.6,222 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.5,957 కోట్లతో పోలిస్తే 4.4 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 23 శాతం తగ్గుదలతో రూ.1,07,905 కోట్ల నుంచి రూ.83,064 కోట్లకు చేరింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా దిగిరావడం ఆదాయం తగ్గేందుకు దారితీసింది.

 స్టాండెలోన్ ప్రాతిపదికన...
 స్టాండెలోన్ ప్రాతిపదికన(అనుబంధం సంస్థలు కాకుండా) రూ.6,318 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది క్యూ1లో రూ.5,649 కోట్లతో పోల్చిచూస్తే.. 12 శాతం వృద్ధి చెందింది. గడిచిన ఏడున్నరేళ్లలో ఈ స్థాయి లాభాలను నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. స్టాండెలోన్ ఆదాయం 28.1 శాతం తగ్గి రూ.71,412 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్‌ఎం- ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రాబడి) జోరందుకోవడం కంపెనీ లాభాల జోరుకు దోహదం చేసింది. క్యూ1లో జీఆర్‌ఎం 10.4 డాలర్లకు ఎగబాకింది. ఆరేళ్లలో ఇదే అత్యధిక జీఆర్‌ఎం. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో జీఆర్‌ఎం 8.7 డాలర్లుకాగా, మార్చి క్వార్టర్‌లో ఇది 10.1 డాలర్లుగా ఉంది.

 ఇతర ముఖ్యాంశాలివీ..
{పధానమైన రిఫైనరీ వ్యాపారం నుంచి స్థూల లాభం(పన్ను ముందు) క్యూ1లో 37.7 శాతం ఎగసి రూ.5,252 కోట్లుగా నమోదైంది. ఆదాయం మాత్రం 30 శాతం క్షీణతతో రూ.68,729 కోట్లకు తగ్గింది. క్రూడ్ ధర పతనం దీనికి ప్రధానంగా దారితీసిన అంశం.

►పెట్రోకెమికల్ వ్యాపారం స్థూల లాభం 25.5% ఎగసి రూ.2,338 కోట్లకు చేరింది. ఈ రంగంలో ఆదాయం 18% తగ్గుదలతో రూ.20,858 కోట్లుగా నమోదైంది.
►అమెరికాలో షేల్ గ్యాస్ ఉత్పత్తి ఆదాయం 47.2 శాతం క్షీణించి రూ.854 కోట్లకు పరిమితమైంది. స్థూల నష్టం రూ.49 కోట్లుగా నమోదైంది.

ఇక చమురు-గ్యాస్ ఉత్పత్తి వ్యాపారానికి సంబంధించి స్థూల లాభం 97% దిగజారి..  రూ.32 కోట్లకు పరిమితమైంది. గతేడాది క్యూ1లో ఈ మొత్తం రూ.1,042 కోట్లుగా ఉంది. ఈ వ్యాపార విభాగం నుంచి ఆదాయం కూడా 35.3% పడిపోయి రూ.3,178 కోట్ల నుంచి రూ. 2,057 కోట్లకు దిగజారింది. క్రూడ్ ధరల క్షీణత, గ్యాస్ ఉత్పత్తి పతనం వంటివి దీనికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఇక కేజీ-డీ6 ప్రధాన క్షేత్రాల నుంచి క్యూ1లో రిలయన్స్ 0.44 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు, 37 బిలియన్ ఘనపుటడుడుల(బీసీఎఫ్) గ్యాస్ ను ఉత్పత్తి చేసింది. గతేడాదితో పోలిస్తే వీటి ఉత్పత్తి వరుసగా 16%, 13% చొప్పున పడిపోయింది.

రిలయన్స్ రిటైల్ స్థూల లాభం 19% ఎగబాకి రూ.171 కోట్ల నుంచి రూ.203 కోట్లకు పెరిగింది. ఆదాయం 17.5 శాతం వృద్ధితో రూ.3,999 కోట్ల నుంచి రూ.4,698 కోట్లకు ఎగసింది. దేశవ్యాప్తంగా రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం 210 నగరాల్లో 2,747 స్టోర్లను నిర్వహిస్తోంది.

ఈ ఏడాది జూన్‌నాటికి రిలయన్స్ మొత్తం రుణ భారం రూ.1,70,814 కోట్లకు పెరిగింది. మార్చి చివరికి ఈ మొత్తం రూ.1,60,860 కోట్లు. ఇక కంపెనీ వద్ద జూన్ చివరికి ఉన్న మొత్తం నగదు నిల్వలు రూ.87,391 కోట్లు.

డిసెంబర్‌లో టెలికం కార్యకలాపాలు ప్రారంభించనున్న రిలయన్స్ జియో సొంత బ్రాండ్‌పై 4జీ హ్యాండ్‌సెట్స్‌ను విక్రయించాలని యోచిస్తోంది. ఇందుకు ప్రముఖ హ్యాం డ్‌సెట్ తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది. దీని ధర రూ. 4,000 కన్నా తక్కువగానే ఉండొచ్చని అంచనా.
 గురువారం బీఎస్‌ఈలో రిలయన్స్ షేరు ధర 1.97 శాతం క్షీణించి రూ.1,025 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి.
 
 క్రూడ్ ధరలు భారీగా పడిపోయిన పరిస్థితుల్లో కూడా కంపెనీ మెరుగైన పనితీరుకు ప్రధానంగా హైడ్రోకార్బన్ కార్యకలాపాల అనుసంధానం దోహదం చేసింది. పెట్రో ఉత్పత్తులకు డిమాండ్ పుంజుకోవడంతో పటిష్టమైన రిఫైనింగ్ మార్జిన్లను సాధించగలిగాం. పెట్రోకెమికల్స్ వ్యాపారం కూడా జోరందుకుంది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ రంగాల్లో భారీ పెట్టుబడులు, వీటి అనుసంధానంవల్ల ముడి వనరులకు సంబంధించిన వ్యయాలు తగ్గేందుకు వీలవుతోంది. రిలయన్స్ జియో ద్వారా ప్రతిష్టాత్మకమైన 4జీ టెలికం సేవల ప్రారంభం తుది అంకానికి చేరుకుంది. కోట్లాది మంది భారతీయుల జీవనగమనంలో నూతనోత్తేజాన్ని నింపేందుకు మా 4జీ సేవలు దోహదం చేయనున్నాయి.
 - ముకేశ్ అంబానీ, ఆర్‌ఐఎల్ చైర్మన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement