ఇలా అయితే రేట్లు పెంచేస్తాం.. | Roll back call drop penalty: Telcos to Trai | Sakshi
Sakshi News home page

ఇలా అయితే రేట్లు పెంచేస్తాం..

Published Wed, Oct 28 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

ఇలా అయితే రేట్లు పెంచేస్తాం..

ఇలా అయితే రేట్లు పెంచేస్తాం..

కాల్ డ్రాప్ పెనాల్టీలపై ట్రాయ్‌కు టెల్కోల లేఖ
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ అయితే మొబైల్ ఆపరేటర్లు కస్టమర్లకు పరిహారం చెల్లించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశాలకు వ్యతిరేకంగా టెల్కోలు గళమెత్తాయి. కాల్స్‌కి అంతరాయాలే ఉండని నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేయడం సాధ్యంకాదని స్పష్టం చేశాయి. బలవంతంగా జరిమానాలు కట్టిస్తే.. తాము మొబైల్ టారిఫ్‌లు పెంచేయాల్సి వస్తుందని హెచ్చరించాయి.

టెలికం కంపెనీల సమాఖ్యలు సీవోఏఐ, ఏయూఎస్‌పీఐ ఈ మేరకు ట్రాయ్‌కు సంయుక్తంగా లేఖ రాశాయి. పెనాల్టీల విధానం వల్ల కాల్ డ్రాప్ సమస్య పరిష్కారం కాకపోగా.. పరిహారం లభిస్తుందనే ఆశతో కస్టమర్లు కావాలనే కాల్స్‌కి అంతరాయాలూ కలిగేలా వ్యవహరించే అవకాశం ఉందని అవి పేర్కొన్నాయి. దీనివల్ల కాల్ డ్రాప్స్ ఇంకా పెరిగిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశాయి.

యూజరుకు కట్టిన పరిహారాలను రాబట్టుకునేందుకు ఆపరేటర్లు టారిఫ్‌లను పెంచాల్సి వస్తుందని, అంతిమంగా కస్టమర్లు టెలికం సర్వీసులు పొందాలంటే మరింత ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని టెల్కోలు పేర్కొన్నాయి. జరిమానాల విధానం.. అపరిమిత దుర్వినియోగానికి తలుపులు బార్లా తెరిచినట్లే అవుతుందని తెలిపాయి.

సగటున యూజర్ నుంచి తమకు వచ్చే ఆదాయమే రూ. 125 కాగా, పరిహారం కింద నెలకు రూ. 90 కట్టాల్సి వస్తే పరిస్థితి ఏంటనేది పరిశ్రమను కలవరపరుస్తోందని టెలికం సంస్థలు పేర్కొన్నాయి. జనవరి 1 నుంచి కాల్ డ్రాప్ అయిన పక్షంలో కస్టమర్లకు టెల్కోలు పరిహారం చెల్లించాలంటూ ట్రాయ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. రోజుకు గరిష్టంగా మూడు కాల్స్‌కు, పెనాల్టీని రూ. 3కి పరిమితి విధించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement