హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వయం సహాయ సంఘాలకు ఒక్కో గ్రూపునకు రూ.25 లక్షల వరకు రుణం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు యోచిస్తోంది. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఈ రుణాన్ని అందజేస్తామని బ్యాంకు చైర్మన్ వి.నర్సిరెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో సంఘానికి రూ.7.5 లక్షల వరకు లోన్ సమకూరుస్తున్నామని చెప్పారు. 1,94,776 గ్రూపులకు ఇప్పటి వరకు రూ.5,600 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. భారత్‌లో ఎస్‌బీఐ తర్వాత అత్యధికంగా స్వయం సహాయ సంఘాలకు లోన్లు జారీ చేసిన సంస్థగా నిలిచామన్నారు. ఈ సంఘాల్లో మొత్తం 25 లక్షల పైచిలుకు సభ్యులు ఉన్నారని వివరించారు.
ఆధార్ ఆధారిత...: పేపర్ లెస్ (గ్రీన్ బ్యాంకింగ్) దిశగా అడుగులేస్తున్నామని నర్సిరెడ్డి చెప్పారు. 45 లక్షల బ్యాంకు ఖాతాల్లో 95 శాతం ఆధార్‌కు అనుసంధానం అయ్యాయని చెప్పారు. ‘ఆధార్‌ను ఆధారంగా చేసుకుని బ్యాంకులో కస్టమర్లు తమ లావాదేవీలు పూర్తి చేసుకునే అవకాశం ఉండడం గ్రీన్ బ్యాంకింగ్ ప్రత్యేకత. వేలి ముద్రల ఆధారంగా ఈ లావాదేవీలు ఉంటాయి. ఉదాహరణకు నగదు తీసుకోవాల్సిన కస్టమర్ చెక్కు, వోచరు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. చిన్న ఉపకరణంపై వేలి ముద్ర వేస్తే చాలు. పూర్తిగా పేపర్‌లెస్ కార్యకలాపాలు ఉంటాయి. లావాదేవీల విషయంలో ఎటువంటి అడ్డంకులు ఉండవు. మోసానికి తావు లేదు. నెల రోజుల్లో గ్రీన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాం’ అని వివరించారు.
ఖర్చు తగ్గుతుంది..: ఇప్పుడున్న విధానంలో ఒక్కో లావాదేవీకి బ్యాంకుకు సగటున రూ.45–50 ఖర్చు అవుతోంది. గ్రీన్ బ్యాంకింగ్ విధానంలో ఇది రూ.10 లోపే ఉంటుంది. సంస్థ లావాదేవీల్లో ఇప్పుడు డిజిటల్ వాటా 28 శాతం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ స్మార్ట్ యూజర్లు ఉండడం విశేషం. ఒక లక్ష మంది యాప్ ద్వారా సేవలు పొందుతున్నారు. రోజుకు రూ.4 కోట్ల విలువైన లావాదేవీలు డిజిటల్ విధానంలో జరుగుతున్నాయి. కస్టమర్ల సౌలభ్యం కోసం తెలుగులోనూ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఈ ఏడాది 10 లక్షల మంది కస్టమర్లకు ఈ యాప్‌ను చేర్చాలని సంస్థ లక్ష్యంగా చేసుకుంది.
సెక్యూరిటీ లేకుండా రూ.25 లక్షలు
Published Thu, May 17 2018 1:04 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment