జ్యూరిచ్/న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల్లోని డిపాజిట్లను క్లెయిమ్ చేసుకునే వారు కరువయ్యరు. స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ 2015 డిసెంబర్‌లో అక్కడి బ్యాంకుల్లో అచేతనంగా ఉన్న ఖాతాలు లేదా క్లెయిమ్ చేసుకోకుండా ఉన్నవాటి వివరాలతో కూడిన జాబితా విడుదల చేసింది. వీటిలో స్విట్జర్లాండ్ పౌరులతో పాటు విదేశీయులవి, భారతీయులకు సంబంధించిన ఖాతాలు కూడా ఉన్నాయి. కానీ, ఇంత వరకు వాటికి సంబంధించి ఏ మాత్రం పురోగతి లేదు.
ఈ ఖాతాల అసలు యజమానులు లేదా వారి చట్టబద్ధమైన వారసులు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుగా నాడు జాబితాను విడుదల చేయడం జరిగింది. 3,500 ఖాతాలకు గాను కనీసం ఓ 6 భారతీయులకు సంబంధించినవి ఉన్నాయి. క్లెయిమ్ వస్తే గనుక సంబంధిత ఖాతాలను జాబితా నుంచి తొలగిస్తున్నారు. 2017లో కేవలం 40 ఖాతాలకు సంబంధించి క్లెయిమ్‌లు వచ్చాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలకు చెందిన వారు స్విస్ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లను దాచుకున్న విషయం గమనార్హం. అయితే, అంతర్జాతీయంగా నల్లధనంపై చర్యలు తీవ్రతరం కావడంతో స్విట్జర్లాండ్ భారత్ సహా పలు దేశాలతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేందుకు ఒప్పందాలు చేసుకుంది. స్విస్ నేషనల్ బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం 2017లో భారతీయులకు సంబంధించిన ఖాతాల్లో రూ.7,000 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment