అర నిమిషంలో రూ.8 కోట్లు!
ప్రపంచ ఈ-కామర్స్ రంగం ఆదాయం ఇది...
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఈ-కామర్స్ రంగం ప్రతి 30 సెకన్లకు 1.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8 కోట్లు) ఆదాయాన్ని గడిస్తోంది. ఈ ఆదాయ పెరుగుదలకు సోషల్ మీడియా విస్తరణే కారణంగా కనిపిస్తోంది. అసోచామ్-డెలాయిట్ నివేదిక ప్రకా రం.. ఈ-కామర్స్ రంగ ఆదాయంలో సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, పిన్‌టరెస్ట్, ట్వీటర్‌ల వాటా వరుసగా 5,483 డాలర్లుగా, 4,504 డాలర్లుగా, 4,308 డాలర్లుగా ఉంది. మార్కెట్‌లోని కొత్త ఉత్పత్తులు, వాటి గురించిన రివ్యూలు, రేటింగ్స్ వంటి తదితర మొత్తం సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు యూజర్లకు అందిస్తున్నాయి. దీనితోపాటు వినియోగదారుల ప్రశ్నలను ఈ-కామర్స్ సంస్థలకు తెలిసేలా చేసి వారు వారి బ్రాండ్ల ఏర్పాటులో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయపడుతున్నాయి.
అలాగే ఈ-కామర్స్ సంస్థలు ప్రకటించే సీజనల్ సేల్స్, వివిధ రకాల ఆఫర్లను సాధ్యమైనంత మందికి తెలిసేలా చేస్తున్నాయి. ‘సామాజిక మాధ్యమాలు ప్రత్యక్షంగా ఈ-కామర్స్ సైట్లతో అనుసంధానమై ఉన్నాయి. దీంతో కొనుగోలుదారుడు ఆయా ఉత్పత్తులకు సంబంధించిన ధర, లభ్యత, డెలివరీ స్టేటస్, రివ్యూలు వంటి మొత్తం సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు. దీని వల్ల కొనుగోలుదారుడు అతనికి నచ్చిన ఉత్పత్తిని కొనడానికి ఆస్కారం కలుగుతోంది’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్. రావత్ తెలిపారు. ఈ-కామర్స్ సంస్థల ఆదాయ వృద్ధిలో ఆయా కంపెనీల యాప్స్ ప్రధాన భూమిక పోషిస్తున్నాయని వివరించారు. ఈ-కామర్స్ సంస్థల ఆదాయంలో దాదాపు సగ భాగం మొబైల్ ఫోన్ల నుంచే ఉందని తెలిపారు.