ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వేగంగా కిందకు జారుతోంది. శుక్రవారం ఏకంగా 32 పైసలు బలహీనపడింది. 66.12 వద్ద ముగిసింది. గడచిన 13 నెలల్లో ఈ స్థాయికి రూపాయి పతనం ఇదే తొలిసారి. వరుసగా ఐదు రోజుల నుంచీ రూపాయి పతనం కొనసాగుతోంది. గురువారం రూపాయి ముగింపు 65.80. శుక్రవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్‌లో ట్రేడింగ్ ప్రారంభంతోనే గ్యాప్‌డౌన్‌తో 66.06 వద్ద ప్రారంభమైంది. ఏప్రిల్‌లో ఇప్పటికి రూపాయి దాదాపు ఒక శాతం పతనమయ్యింది.
కదలికలు ఇలా...
2016 నవంబర్‌లో 68.60 స్థాయికి పతనమైన రూపాయి, అందరి అంచనాలకూ భిన్నంగా భారత్ ఆర్థిక వ్యవస్థపై ఆశావహ పరిస్థితి, డాలర్ బలహీనత అంశాల నేపథ్యంలో... వేగంగా బలపడుతూ వచ్చింది. ఈ ఏడాది మొదటి నెల్లో 63.24ను చూసింది. అయితే అటు తర్వాత ఆర్థిక అనిశ్చితులతో దాదాపు మూడు నెలలు ఒడిదుడుకులతో బలహీనపడుతూ, క్రమంగా 65కు చేరింది.
అటు తర్వాత కేవలం వారం రోజల్లో (0.88 శాతం పతనం) ప్రస్తుత స్థాయి 66.12కు చేరింది. ఈ వార్త రాస్తున్న సమయం రాత్రి 8.30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి మరింత బలహీనపడి 66.30 వద్ద ట్రేడవుతోంది. ఇదే తీరున ముగిస్తే, సోమవారం దాదాపు మరో 20పైసలు గ్యాప్‌డౌన్‌తో రూపాయి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
బలహీనతకు కారణాలు...
అంతర్జాతీయంగా క్రూడ్ ధరల అప్‌ట్రెండ్ తాజా పరిస్థితికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ బ్రెంట్ ధర బేరల్‌కు గురువారం మూడేళ్ల గరిష్టస్థాయి 77.75 డాలర్లను తాకింది. మధ్య ప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు, అమెరికాలో పెరిగిన క్రూడ్ డిమాండ్, క్రూడ్ 100 డాలర్లకు చేరాలని సౌదీ అరేబియా భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఈ కమోడిటీ పరుగుకు దారితీస్తున్నాయి. తన చమురు అవసరాల్లో 80 శాతం భారత్ దిగుమతులపై ఆధారపడుతోంది.
క్రూడ్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఎగుమతులు–దిగుమతులకు మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు, తద్వారా క్యాడ్ (ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ, ఈసీబీలు మినహా దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) ప్రతికూలతలు దేశానికి తలనొప్పి తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం సవాళ్లూ పొంచి ఉన్నాయి. ఆయా అంశాలు స్టాక్ మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితి పరిస్థితులను సృష్టిస్తున్నాయి. దీనితో రూపాయి బలహీనత సమస్య తీవ్రమవుతోంది.
జూన్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ రేటును పెంచుతుందన్న అంచనాలూ రూపాయి బలహీనతకు దారితీస్తోంది. దేశానికి ఎఫ్‌డీఐల ప్రవాహం, రికార్డు స్థాయిలో (ప్రస్తుతం 424 బిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్య నిల్వలు కొనసాగింపు వంటి అంశాలు రూపాయి ఒడిదుడుకులను నియంత్రించే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
లైఫ్ టైమ్ గరిష్టంలో ఫారెక్స్ నిల్వలు
426 బిలియన్ డాలర్లకు చేరిక
ముంబై: భారత విదేశీ మారక నిల్వలు లైఫ్ టైమ్ గరిష్టానికి చేరాయి. ఏప్రిల్ 13తో ముగిసిన వారాంతానికి 1.217 బిలియన్ డాలర్లు పెరిగి 426.082 బిలియన్ డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ నిల్వలు గణనీయంగా పెరగడం ఇందుకు తోడ్పడినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
విదేశీ కరెన్సీ అసెట్స్ 1.202 బిలియన్ డాలర్లు పెరిగి 400.978 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు యధాతథంగా 21.484 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతకు ముందు వారంలో ఫారెక్స్ నిల్వలు 503.6 మిలియన్ డాలర్లు పెరిగి 424.864 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది సెప్టెంబర్ 8న తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మార్కును దాటిన విదేశీ మారక నిల్వలు అప్పట్నుంచీ హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment