
ముంబై: బలహీనపడుతూ వస్తున్న రూపాయి శుక్రవారం కొంత కోలుకుంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో ఒకేరోజు 56 పైసలు బలపడి 67.78 వద్ద ముగిసింది. రూపాయి ఒకేరోజు ఇంత బలపడ్డం ఈ ఏడాది ఇదే తొలిసారి.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు (10 రోజుల క్రితం 4 ఏళ్ల గరిష్ట స్థాయిలో 80.5 డాలర్లకు చేరిన బ్రెంట్ బేరల్ ధర ఈ వార్త రాసే సమయం రాత్రి 9 గంటల సమయానికి 76.19 స్థాయి వద్ద ట్రేడవుతోంది.) కొంత ఉపశమించడం, ఈక్విటీ మార్కెట్ లాభపడటం రూపాయి బలానికి కారణం. మే 31న విడుదలయ్యే జీడీపీ ఫలితాలు బాగుంటాయన్న అంచనాలు, వర్షాలు బాగుండి, ధరలు తగ్గుతాయన్న విశ్లేషణలు రూపాయికి తక్షణ బలాన్ని తెచ్చాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ విశ్లేషకుడు ఆనంద్ జేమ్స్ చెప్పారు.