
స్వీడన్ సంస్థ శాబ్‌తో అదానీ జట్టు
న్యూఢిల్లీ:రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ దిశగా స్వీడన్‌కి చెందిన దిగ్గజ సంస్థ శాబ్‌తో అదానీ గ్రూప్ చేతులు కలిపింది. భారతీయ వైమానిక దళాలకు కావాల్సిన సింగిల్ ఇంజిన్ ఫైటర్ జెట్స్ కాంట్రాక్టు దక్కించుకోవడం లక్ష్యంగా ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. మేకిన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా భారత్ కోసం గ్రిపెన్ జెట్ విమానాల రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తి కార్యకలాపాలు చేపట్టనున్నట్లు రెండు సంస్థలు తెలిపాయి.
ఈ కాంట్రాక్టు దక్కించుకోవడంలో అమెరికన్ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ ప్రధాన పోటీదారుగా ఉండనుంది. అధునాతన రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ రంగంలో ప్రవేశించాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా శాబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో పెద్దగా అనుభవం లేని అదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంపై వివరణ ఇస్తూ.. భారత్‌లో అతి పెద్ద కంపెనీల్లో ఒకటి కావడంతో పాటు పలు రంగాల్లో మెరుగైన పనితీరు కనబరుస్తున్న సంస్థ కాబట్టే చేతులు కలిపినట్లు శాబ్ సీఈవో హకాన్ బుష్కీ చెప్పారు.