ఆస్తుల విక్రయానికి హెడ్జ్ ఫండ్స్‌తో సహారా ఒప్పందం!
లండన్: రుణ రీఫైనాన్సింగ్ కోసం సహారా గ్రూప్ రెండు అమెరికన్ హెడ్జ్ ఫండ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుందని, తద్వారా బిలియన్ డాలర్ల(సుమారు రూ. 6,100 కోట్లు)ను సమకూర్చుకోనున్నట్లు లండన్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. భారత్‌లోని తీహార్ జైలులో ఉన్న సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ విడుదలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు సండే టైమ్స్ వివరించింది. సహారాకు న్యూయార్క్, లండన్‌లలోగల మూడు హోటళ్ల ఆధారంగా హెడ్జ్ ఫండ్స్ ఈ నిధులు అందిస్తాయని నెలల చర్చల తరువాత ఇందుకు గతవారమే డీల్ కుదిరినట్లు సండే టైమ్స్ పేర్కొన్నప్పటికీ, ఈ వార్త వాస్తవం కాదంటూ సహారా కంపెనీ ప్రతినిధి ఒకరు పీటీఐ ప్రతినిధికి తెలిపారు.
బాండ్ల విక్రయం ద్వారా ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన పెట్టుబడులను తిరిగి చెల్లించే విషయంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి, సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌కూ మధ్య వివాదం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు రాయ్‌ను మార్చిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం షరతులకు అనుగుణంగా ఆస్తుల విక్రయం ద్వారా రాయ్ బెయిలు కోసం ప్రయత్నిస్తున్నారు.