సహారా హోటల్స్ డీల్‌లో లలిత్‌మోదీ పేరు | Sahara Hotels in Deal Lalitmodi | Sakshi
Sakshi News home page

సహారా హోటల్స్ డీల్‌లో లలిత్‌మోదీ పేరు

Published Tue, Aug 18 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

సహారా హోటల్స్ డీల్‌లో లలిత్‌మోదీ పేరు

సహారా హోటల్స్ డీల్‌లో లలిత్‌మోదీ పేరు

- సుప్రీంకోర్టు ముందు వివరాలు తెలిపిన
- అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ తరఫు న్యాయవాది..
న్యూఢిల్లీ
: లండన్, న్యూయార్క్‌ల్లోని సహారా హోటల్స్  అమ్మకాల వ్యవహారంలో ‘తీవ్ర రాజకీయ వివాదంలో’ ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ చీఫ్ లలిత్ మోదీ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... సహారాకు లండన్‌లో గ్రోస్‌వీనార్ హౌస్ హోటల్, న్యూయార్క్‌లో న్యూయార్క్ ప్లాజా, డ్రీమ్ న్యూయార్క్ హోటల్స్ ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు సంవత్సన్నర కాలంలో తీహార్ జైలులో ఉంటున్న సహారా చీఫ్ సుబ్రతోరాయ్ బెయిల్‌పై విడుదలకు, రూ.10,000 కోట్లను సమీకరించడంలో భాగంగా ఈ హోటళ్ల విక్రయ ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతోంది.

ఈ హోటళ్లను తాము కొనుగోలు చేస్తామని విన్నవిస్తూ... బ్రిటన్‌కు చెందిన కేన్ కేపిటల్ పార్ట్‌నర్స్ లిమిటెడ్, అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ మిడ్‌సన్ కేపిటల్ హోల్డింగ్ ఎల్‌ఎల్‌సీలు అత్యున్నత న్యాయస్థానంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిని సుప్రీంకోర్టు సోమవారం విచారణకు చేపట్టింది.  మిడ్‌సన్ కేపిటల్ తరఫున వివరాలను కోర్టుకు తెలుపుతున్న న్యాయవాది... ఈ సందర్భంగా లలిత్ మోదీ పేరును జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ ముందు ప్రస్తావించారు.

సుబ్రతోరాయ్ కుమారుడు శుశాంతో రాయ్ విదేశీ హోటళ్ల విక్రయానికి సంబంధించి లలిత్ మోదీ సహాయాన్ని కోరినట్లు తెలిపారు. సహారా తరఫున మోదీనే డీల్ వ్యవహారాలు చూస్తున్నారని సైతం సూచించారు. తన క్లెయింట్ న్యూయార్క్‌లో హోటళ్ల కొనుగోలుకు 800 మిలియన్ డాలర్లను ఆఫర్ చేస్తూ... మోదీకి ఒక లేఖ రాశారని పేర్కొన్నాయి. అయితే మోదీ దీనికి ఒక మెయిల్‌లో జవాబిస్తూ... గ్రూప్ ఆఫర్ 965 మిలియన్ డాలర్లుగా ఉందని తెలియజేశారని, ఈ మెయిల్ శుశాంతోకు కూడా మార్క్ చేసి ఉందని విన్నవించారు. కాగా బ్రిటన్ హోటల్ కొనుగోలుకు ముందుకు వచ్చిన  కేన్ కేపిటల్ పార్ట్‌నర్స్ ఈ డీల్‌కు సంబంధించి 637 మిలియన్ పౌండ్లను ఆఫర్ చేసింది.
 
పూర్తిగా హోటళ్లను అమ్మబోం: సహారా
ఈ ఆఫర్లను మీ క్లయింట్ ఆమోదిస్తున్నారా! అని ఈ సందర్భంగా సహారా తరఫు వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబల్‌ను బెంచ్ ప్రశ్నించింది. ఈ సందర్భంగా సిబల్ సమాధానం చెబుతూ, హోటళ్లను పూర్తిగా అమ్మదలచుకోవడంలేదని తెలిపారు. మరింత అధిక మొత్తంతో మరో రెండు కొత్త ఆఫర్లు సైతం పెండింగులో ఉన్నట్లు తెలిపారు. కొన్ని సంస్థలు హోటళ్లను దురాక్రమణ చేయాలని భావిస్తున్నట్లు కూడా సహారా తరఫున సిబల్ కోర్టుకు ఈ సందర్భంగా తెలిపారు.  హోటళ్ల విక్రయ ప్రతిపాదనల పురోగతి, చైనా బ్యాంక్‌తో రుణ లావాదేవీల అంశాలను ఎప్పటికప్పుడు అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేయాలని ధర్మస్థానం ఆదేశించింది.  కాగా ఆస్తుల విక్రయానికి సంబంధించి తీహార్ జైలు కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రత్యేక సదుపాయాలను సహారా చీఫ్‌కు పొడిగించాలన్న కపిల్‌సిబల్ విజ్ఞప్తిని కోర్టు ఆమోదించింది. కేసు తదుపరి విచారణ వచ్చేనెల 14కు వాయిదా పడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement