హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అన్ని రంగాలూ కరోనా వైరస్ దెబ్బకి విలవిల్లాడుతున్నాయి. రియల్టీ మరీనూ! ఇలాంటి తరుణంలో హైదరాబాద్‌కు చెందిన ప్రణీత్ గ్రూప్ రెండు భారీ ప్రాజెక్ట్‌లను ఆరంభించింది. అదే విషయాన్ని గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజును అడిగితే... అందుబాటు ధర, నాణ్యత, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగిన వారికి ఎప్పుడూ విక్రయాలకు ఇబ్బంది ఉండదని చెప్పారు. రియల్టీకి చెందిన పలు అంశాలను సాక్షితో పంచుకున్నారు. అవి..
►కరోనా నేపథ్యంతో పాత ప్రాజెక్ట్‌లను పూర్తి చేయటమే కష్టమంటున్నారు కదా?
కొంత నిజమే!!. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రా రంభమయ్యాక.. అంతకుముందు జరిగిన అగ్రిమెంట్లు రద్దవుతాయని, కొత్త యూనిట్ల విక్రయాలు జరగవని అందరిలాగే మాకూ సందేహాలొచ్చాయి. కానీ, లాక్‌డౌన్ ముగిసి అన్నీ తెరుచుకుంటున్న సందర్భంలో పరిస్థితి మా రింది. అందుబాటు ధర, నిర్మాణంలో నాణ్యత, సమయానికి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయగలిగితే కస్టమర్లు ఆదరిస్తారనే నమ్మకం మొదటి నుంచీ ఉంది. ఆ భరోసాతోనే కొత్త ప్రాజెక్టులు ఆరంభించాం. లాక్‌డౌన్ ముగిశాక ప్రతి వారం 80–100 వాకిన్స్ వస్తున్నాయి. కొన్ని యూనిట్లు విక్రయమయ్యాయి కూడా.
►కరోనాతో కార్మికుల కొరత లేదా?
కరోనా పేరు చెప్పి ధరలు పెంచని రంగమంటూ ఏదైనా ఉంటే అది రియల్టీయే. నిజానికి ఇప్పుడున్న ధరలకు విక్రయించినా డెవలపర్లకు లాభమే. ఎందుకంటే 2008–12 ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా లేనంతగా ప్రస్తుతం గృహ రుణ వడ్డీ రేట్లు 6 నుంచి 7 శాతానికి దిగివచ్చాయి. తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనం మొట్ట మొదట అందేది డెవలపర్లకే. ఇక కరోనా వల్ల కార్మికుల సమస్య పెరిగిందని చెప్పలేం. ఎందుకంటే ఏటా రంజాన్, వర్షాకాలం ప్రారంభంలో ఇతర రాష్ట్రాల కార్మికులు సెలవుల మీద వెళతారు. ఈసారి ఇంకాస్త ముందు వెళ్లారనుకోవాలి. యజమానులు కాస్త చొరవ చూపించి ప్రోత్సాహకాలిస్తే వచ్చే నెల రోజుల్లో వారు తిరిగి తమ పనుల్లోకి వస్తారు.
►అయితే ఖర్చులు పెరగలేదంటారా?
కార్మికుల వ్యయం, నిర్మాణ సామగ్రి ధరలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులు పెరిగాయన్నది నిజం. మేమైతే కరోనా కంటే ముందున్న ధరలకే విక్రయిస్తున్నాం. దీనికింకో కారణం కూడా ఉంది. అదేంటంటే... వీలైనంత వరకూ హ్యూమన్ టచ్ లేకుండా టెక్నాలజీని వినియోగించడాన్ని కరోనా నేర్పించింది. దీనివల్ల నిర్మాణ వ్యయం కొంత పెరిగినా ప్రాజెక్ట్ త్వరగా పూర్తవుతుంది. వృథా తగ్గుతుంది.
►హైదరాబాద్ రియల్టీ మార్కెట్ ఎలా ఉండొచ్చు?
దేశంలోని ఇతర మెట్రోలకు, హైదరాబాద్ రియల్టీకి తేడా ఉంది. ఇక్కడ రెసిడెన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ తక్కువ. ఇళ్లు కొనేది అద్దెల కోసమో లేక ధర ఎక్కువ వచ్చినప్పుడు తిరిగి అమ్ముకోవటానికో కాదు. సొంతంగా ఉండేందుకు కొనేవారే ఎక్కువ. వీళ్లకు కావాల్సిందల్లా.. అందుబాటు ధర, నాణ్యత, బిల్డర్ ట్రాక్ రికార్డ్, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి అంతే.
Comments
Please login to add a commentAdd a comment