శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 వచ్చేసింది...
బార్సిలోనా: శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్ సిరీస్‌లో ఐదవ జనరేషన్ మోడల్ ఎస్5ను ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్‌లో తాజా వెర్షన్, 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌ను ఇక్కడ జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో కంపెనీ డిస్‌ప్లే చేసింది. వరల్డ్ మొబైల్ కాంగ్రెస్(డబ్ల్యూఎంసీ) ఈవెంట్ తర్వాతనే గెలాక్సీ మోడల్ ఫోన్లను శామ్‌సంగ్ కంపెనీ విడుదల చేయడం సాధారణం. ఈసారి ఈ రివాజుకు భిన్నంగా డబ్ల్యూఎంసీలోనే ఈసారి గెలాక్సీ తాజా మోడల్‌ను శామ్‌సంగ్ విడుదల చేయడం విశేషం. ఫింగర్ స్కానర్, వేగవంతమైన కెమెరా, దుమ్ము, నీటి నిరోధకత వంటి వినూత్న ఫీచర్లతో ఈ ఫోన్‌ను కంపెనీ రూపొందించింది. భారత్‌తో సహా ఇతర దేశాల్లో ఏప్రిల్ 11 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొంది. ధర ఎంతనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
జీవన శైలి పరికరం...
రోజువారీ దైనందిన కార్యకలాపాలను మరింత సౌకర్యవంతం చేసే మొబైల్ ఫోన్లకే వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా శామ్‌సంగ్ ప్రెసిడెంట్, హెడ్(ఐటీ, మొబైల్ కమ్యూనికేషన్స్ డివిజన్) జె.కె. షిన్ పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవాటి కంటే అత్యుత్తమంగా ఉండేలా గెలాక్సీ ఎస్5 ఫోన్‌ను రూపొందించామని ఆయన చెప్పారు. ఇదొక జీవనశైలి పరికరమని ఆయన అభివర్ణించారు.
ప్రత్యేక ఫీచర్లు ఇవీ...
ఫింగర్ స్కానింగ్: సురక్షితమైన బయోమెట్రిక్ స్క్రీన్ లాకింగ్ ఫీచర్. ఇది భద్రమైన మొబైల్ చెల్లింపు ఫీచర్ కూడా(యాపిల్ ఐఫోన్ 5ఎస్‌లో ఈ ఫీచర్ ఉంది)
ఎస్ హెల్త్: ఆరోగ్యంగా ఉండటానికి వినియోగదారులకు తోడ్పడే ఒక టూల్. పెడో మీటర్, డైట్, ఎక్సర్‌సైజ్ రికార్డులు, గుండె స్పందనలను లెక్కించే హార్ట్ రేట్ మానిటర్‌లతో కూడిన ఈ తరహా ఫీచర్‌ను తర్వాతి ఐ ఫోన్ మోడల్‌లో తేవాలని యాపిల్ కంపెనీ కసరత్తు చేస్తోందని సమాచారం.
కిడ్స్ మోడ్: పిల్లలకు సంబంధించిన అప్లికేషన్(యాప్)లకే ఫోన్‌లో యాక్సెస్ ఉంటుంది.
పవర్ సేవింగ్ మోడ్: డిస్‌ప్లే బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుంది. తరచుగా వాడే యాప్స్‌నే డిస్‌ప్లేలో ఉంచుకోవచ్చు. ఈ ఫీచర్ కారణంగా విద్యుత్ వినియోగం సగం తగ్గుతుందని కంపెనీ పేర్కొంది.
గెలాక్సీ ఎస్5 ప్రత్యేకతలు...
5.1 అంగుళాల(13 సెం.మీ.)
సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే(గెలాక్సీ ఎస్4
మొబైల్ స్క్రీన్ సైజ్)
2.5 గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్.. 2 జీబీ ర్యామ్
16జీబీ, 32 జీబీ మెమరీ(రెండు వేరియంట్లు).. 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ
16 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా(వెనక వైపు), 2.1 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అమర్చారు.
వేగవంతమైన ఆటో ఫోకస్(0.3 సెకన్ల స్పీడ్ )
2800 ఎంఏహెచ్ బ్యాటరీ.. 4 రంగుల్లో లభ్యమవుతుంది.