శామ్‌సంగ్ నుంచి గెలాక్సీ నోట్ ఎడ్జ్
జనవరి మొదటి వారం నుంచి విక్రయాలు
ధర రూ.64,900
న్యూఢిల్లీ: శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ మోడల్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ నోట్ ఎడ్జ్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. జనవరి మొదటి వారం నుంచి విక్రయాలు ప్రారంభిస్తామని, ధర రూ.64,900 అని శామ్‌సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(మొబైల్ అండ్ ఐటీ) ఆశిమ్ వార్శి చెప్పారు. అంచుపైన స్క్రీన్ ఉండడం(ఎడ్జ్ స్క్రీన్) ఈ ఫోన్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. తరుచుగా వాడే యాప్‌లను, అలర్ట్‌లను, డివైస్ ఫంక్షన్లను ఫోన్ కవర్ మూసి ఉన్నప్పటికీ, ఆ అంచుపైన ఉన్న స్క్రీన్‌తో వేగంగా యాక్సెస్ చేసుకోవచ్చని వివరించారు.
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 5.6 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 3.7 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఇంకా ఈ ఫోన్‌లో మల్టీ విండో, డైనమిక్ లాక్ స్క్రీన్, ఎస్ పెన్ ఫీచర్ తదితర ఆకర్షణలున్నాయని వివరించారు.