మనలో చాలా మందికి ఒకటికి మించిన బ్యాంకు ఖాతాలుండటం ఇపుడు సహజమైపోయింది. అయితే, ఇలా ఎక్కువ ఖాతాలుండటం లాభదాయకమేనా? ఇది ప్రతి ఒక్కరూ ఓ సారి ఆలోచించుకోవాల్సిన అంశం. ఎందుకంటే ప్రతి ఖాతాలో కనీస నగదు నిల్వలుచడం తప్పనిసరి. దీనికి తోడు ఏటీఎం, డెబిట్‌కార్డు వార్షిక చార్జీలు, ఎస్‌ఎంఎస్ అలర్ట్స్ చార్జీల రూపంలో రకరకాల ఛార్జీల భారాన్ని మోయాల్సి వస్తుంది. కనుక ఒకటికి మించి ఖాతాలుండే వారు ఓసారి పునః పరిశీలన చేసుకోవాలనేది నిపుణుల సూచన. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి తమ సంస్థ తరఫున వేతన ఖాతాలుంటాయి. అయితే, ఒకే సంస్థలో శాశ్వతంగా ఉద్యోగం చేసే వారు తక్కువ మందే. ఎక్కువ మంది తరచూ సంస్థలు మారుతుంటారు. దీంతో వీరికి ఆయా సంస్థల తరఫున వేతన ఖాతాల సంఖ్య పెరిగిపోతుంటుంది. ఇక ఉద్యోగ జీవితానికి ముందే తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ప్రారంభించిన ఖాతాలు సైతం ఉండొచ్చు. కనుక నిజంగా వీటిల్లో ఎన్నింటి అవసరం ఉందన్న దానిపై ఒక్కసారి దృష్టి సారించాల్సి ఉంది.
జీరో బ్యాలన్స్ ఆఫర్ కనిపించిందనో, మరేదో కారణంతోనో సేవింగ్స్ ఖాతా ప్రారంభించే ముందు ఎంత ఉపయోగం ఉందో ఓ సారి గుర్తించండి. ఒక్కో అవసరానికి ఒక్కో బ్యాంకు ఖాతాను కేటాయించుకోవడం వల్ల సులభంగా ఉంటుందేమో కానీ, ఖాతాల సంఖ్య పెరిగితే గందరగోళానికీ కారణమవుతుంది. నిజానికి గరిష్టంగా ఒక్కొక్కరికి మూడు ఖాతాలకు మించి అవసరం లేదన్నది నిపుణుల సూచన. ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం... వేతనం కోసం ఒకటి, ఖర్చుల కోసం మరొకటి, పెట్టుబడుల కోసం మరో ఖాతా ఉంటే సరిపోతుంది. వేతనంతో పాటు డివిడెండ్ సైతం ఒకే ఖాతాలో ఉండాలనేది వారి సూచన. ఇంటి అవసరాల కోసం చేసే అన్ని ఖర్చులకూ ఒక ఖాతాను ఉపయోగించుకోవాలి. బిల్లుల చెల్లింపులు, గ్రోసరీ కొనుగోళ్లు, ఔషధ కొనుగోళ్లు అన్నీ ఈ ఖాతా నుంచే చేయాలి. ఇక పూర్తిగా పెట్టుబడులు, పొదుపు నిధుల కోసం మూడో ఖాతాను ఉపయోగించుకోవాలి. క్రమశిక్షణకు కట్టుబడే వారు అయితే రెండు బ్యాంకు ఖాతాలు సరిపోతాయన్నది నిపుణుల సూచన. ఒకటి ఆదాయం, పెట్టుబడుల కోసం, రెండో ఖాతా ఖర్చుల కోసం.
ఖాతాలు ఎక్కువైతే...
సేవింగ్స్ ఖాతాలు ఉచితంగా ఏమీ రావు. ప్రతీ ఖాతాకు సంబంధించి కొన్ని చార్జీలుంటాయి. ప్రతీ ఖాతాలోనూ నెలవారీ కనీస సగటు బ్యాలన్స్ నిర్వహించాలి. లేదంటే పెనాల్జీ చార్జీలను బ్యాంకులు వసూలు చేస్తాయి. అలాగే ఖాతాలతోపాటు వచ్చే డెబిట్ కార్డుకు వార్షిక నిర్వహణ చార్జీలు, నెలవారీ ఉంచాల్సిన కనీస బ్యాలన్స్‌పై రాబడులు తక్కువేనని పైసాబజార్ డాట్ కామ పేమెంట్ ప్రొడక్ట్స్ హెడ్ సహిల్ అరోరా పేర్కొన్నారు. ‘‘ఎక్కువ ఖాతాలు మీరు కలిగి ఉంటే, కనీస బ్యాలన్స్ రూపంలో ఎక్కువ మొత్తాన్ని ఉంచాల్సి వస్తుంది. కనీస బ్యాలన్స్ రూ.5,000–10,000 వరకు ఉన్నాయి. ఐదు ఖాతాలు ఉంటే కనీసం రూ.25,000. ఇవి 3–4 శాతం రాబడులనే ఇస్తాయి. ఇలా ఎక్కువ ఖాతాల్లో ఉంచే బ్యాలన్స్‌ను అధిక రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు’’ అని బ్యాంకు బజార్ చీఫ్ డెవలప్‌మెంట్ అధికారి నవీన్ చందాని తెలిపారు.
జాయింట్ ఖాతా మంచిదే...
ఉమ్మడిగా మరొకరితో కలసి ఖాతా తెరిచే వారూ ఉన్నారు. ‘‘అందరికీ ఆర్థిక విషయాల పట్ల అవగాహన ఉండి, ఉమ్మడి లక్ష్యాలతో ఉంటే జాయింట్ అకౌంట్ మంచి నిర్ణయం అవుతుంది. ఇద్దరూ కలిసి లేదా ఎవరో ఒకరు ఆపరేట్ చేసే ఆప్షన్ ఎంచుకోవడం మంచిది’’ అని సృజన్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకులు దీపాలిసేన్ తెలిపారు. ముఖ్యంగా జీవిత భాగస్వాములు ఉమ్మడి ఖాతాను నిర్వహించడం వల్ల ఎన్నో సౌలభ్యాలు ఉంటాయి. అలాగే ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ఏర్పడే సంఘాల సభ్యుల మధ్య ఆర్థిక పారదర్శకతకూ ఉమ్మడి అకౌంట్ దోహదపడుతుంది.
నామినీ తప్పనిసరి...
ఇక 10–15 ఏళ్ల క్రితం ఖాతాలు తెరిచి మరిచిపోయే వారూ ఉంటారు. అందులో కొంత నగదు ఉండి మర్చిపోతే దాన్ని కోల్పోయినట్టే. ఎందుకంటే ఏటా వివిధ చార్జీలను బ్యాంకులు ఆ బ్యాలన్స్ నుంచి మినహాయించుకుంటూ ఉంటాయి. ఇక ఖాతాదారుడు మరణిస్తే వారి పేరిట ఐదారు ఖాతాలుంటే, అన్నింటికీ నామినీ రిజిస్టర్ చేసి లేకపోతే కుటుంబ సభ్యులకు ఎన్నో సమస్యలు కలిగించిన వారవుతారు. అందుకని అవసరానికి మించి ఉండే ఖాతాలు మూసేయడంతోపాటు ముఖ్యమైన ఖాతాలకు నామినీగా జీవిత భాగస్వామి లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరును రిజిస్టర్ చేయించుకోవడం మర్చిపోవద్దు.
Comments
Please login to add a commentAdd a comment