
ఐపీవోపై త్వరలో నిర్ణయం...
10% వాటాల విక్రయ అవకాశం
ఎస్‌బీఐ లైఫ్ ఎండీ అరిజిత్ బసు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఉండొచ్చని, దీనిపై తొలి త్రైమాసికంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ అరిజిత్ బసు తెలిపారు. సాధారణంగా ఐపీవోలో పది శాతం వాటాల విక్రయం ఉండగలదన్నారు. ఎస్‌బీఐ లైఫ్‌లో బీఎన్‌పీ పారిబాకు 26 శాతం వుంది. ఎస్‌బీఐకి 74 శాతం వాటా వుండగా, ఇటీవల ఎస్‌బీఐ 3.9 శాతం వాటాలు విక్రయించింది. తాజాగా ఐపీవోలో ఎస్‌బీఐ 10 శాతం వాటాలు విక్రయించవచ్చని..లేదా ఒకవేళ బీఎన్‌పీ కూడా పాలుపంచుకునే పక్షంలో ఇరు సంస్థలు చెరి అయిదు శాతం విక్రయించే అవకాశాలూ ఉన్నాయని బసు చెప్పారు. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. సోమవారమిక్కడ ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని బీమా రంగ నియంత్రణ సంస్థ సభ్యుడు నీలేష్ సాథే ప్రారంభించిన సందర్భంగా బసు ఈ విషయాలు వివరించారు. మరోవైపు, కొత్తగా క్యాన్సర్ కవరేజికి సంబంధించిన పాలసీని త్వరలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోందని బసు పేర్కొన్నారు. ఏటా 3–4 పాలసీలు ప్రవేశపెడుతున్నామని వివరించిన బసు.. ప్రస్తుతం మొత్తం 28 ఉత్పత్తులను అందిస్తున్నామని తెలిపారు.
ఇక వ్యాపార గణాంకాల విషయానికొస్తే .. డిసెంబర్ దాకా 9 నెలల్లో ప్రీమియం వసూళ్లు 39% మేర వృద్ధి చెందాయని బసు చెప్పారు. హైదరాబాద్ ప్రాంతంలో వ్యక్తిగత పాలసీలకు సంబంధించి మొత్తం న్యూ బిజినెస్ ప్రీమియం 28 శాతం పెరిగి రూ. 397 కోట్ల నుంచి రూ. 508 కోట్లకి పెరిగినట్లు పేర్కొన్నారు. మొత్తం కొత్త బిజినెస్ ప్రీమియంలు 25 శాతం పెరుగుదలతో రూ. 518 కోట్ల నుంచి రూ. 647 కోట్లకు ఎగిశాయన్నారు. డీమోనిటైజేషన్‌కి సంబంధించి తమపై పెద్దగా ప్రభావం లేదని బసు చెప్పారు. మరోవైపు 2015 డిసెంబర్ నాటికి 18 శాతంగా ఉన్న మార్కెట్ వాటా గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి 21 శాతానికి పెరిగిందన్నారు. ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) రూ. 92,000 కోట్ల స్థాయిలో ఉందని వివరించారు. టర్మ్, సంప్రదాయ పాలసీల అమ్మకాలను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు బసు చెప్పారు.