
రూ. 5,500 కోట్ల కొత్త ప్రీమియం ఆదాయ లక్ష్యం
ఎస్‌బీఐ లైఫ్ ఎండీ, సీఈవో అరిజిత్ బసు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఆర్థిక ఏడాదిలో రూ. 5,500 కోట్ల కొత్త ప్రీమియం ఆదాయం, రూ. 8,000 కోట్ల రెన్యువల్ ప్రీమియం ఆదాయం ఆర్జించాలని ప్రైవేటు రంగ బీమా కంపెనీ ఎస్‌బీఐ లైఫ్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గతేడాది కంపెనీ రూ. 5,529 కోట్ల కొత్త ప్రీమియం, రూ, 7,338 కోట్ల రెన్యువల్ ప్రీమియాన్ని ఆర్జించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో రూ. 2,975 కోట్ల కొత్త ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించినట్లు ఎస్‌బీఐ లైఫ్ ఎండి, సీఈవో అరిజిత్ బసు తెలిపారు.
హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ‘మెగా సేల్స్ కాన్‌క్లేవ్’లో పాల్గొన్న బసు విలేకరులతో మాట్లాడారు. యులిప్ అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తోందన్నారు. గత నెల వరకు ప్రతీ నెలా రూ. 1500 - 1800 కోట్ల నికర అమ్మకాలు ఉం డగా ఈ నెల నుంచి రూ. 2,000 కోట్లకు పైగా వస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
మహిళలకు ప్రత్యేకంగా..
జనవరి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 6 పాలసీలను ప్రవేశపెట్టామని, వచ్చే మూడు నెలల్లో మరో రెండు పాలసీలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. డిసెం బర్‌లోగా మహిళల కోసం ప్రత్యేకంగా ఎండోమెంట్ పాలసీని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ‘స్మార్ట్ ఉమెన్ అడ్వాంటేజ్’ పేరుతో ప్రవేశపెట్టే ఈ పాలసీలో మహిళలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులకు రక్షణ (క్రిటికల్ ఇల్‌నెస్) కల్పించే విధంగా తీర్చిదిద్దనట్లు తెలిపారు. అలాగే వచ్చే జనవరిలో అధికాదాయ వర్గాల వారి కోసం ‘స్మార్ట్ ప్రివిలేజ్’ పేరుతో యులిప్ పాలసీని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కనీసం 7-10 వేల మంది ఏజెంట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థలో 86,000 మంది ఏజెంట్లు పనిచేస్తున్నారు.
ఇప్పట్లో ఐపీవో ఆలోచన లేదు...
ఇప్పట్లో ఐపీవోకి వచ్చే ఆలోచన లేదని ఎస్‌బీఐ లైఫ్ ఎండీ, సీఈవో ఈ సందర్భంగా స్పష్టం చేశారు.