ఎస్‌బీఐ లాభం రయ్..
క్యూ4లో 23 శాతం జంప్; రూ. 3,742 కోట్లు
- ఆదాయం రూ.48,616 కోట్లు; 15 శాతం పెరుగుదల
- దిగొచ్చిన మొండి బకాయిలు...
- షేరుకి రూ.3.5 చొప్పున డివిడెండ్...
కోల్‌కతా: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మొండిబకాయిలు దిగిరావడం.. నికర వడ్డీ ఆదాయాల జోరుతో లాభాలు పుంజుకున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం రూ.3,742 కోట్లకు దూసుకెళ్లింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.3,041 కోట్లతో పోలిస్తే లాభం 23% ఎగసింది. ఇక బ్యాంక్ మొత్తం ఆదాయం క్యూ4లో రూ.42,443 కోట్ల నుంచి రూ.48,616 కోట్లకు పెరిగింది. 14.6% వృద్ధి నమోదైంది.
మొండిబకాయిలు తగ్గాయ్...
మార్చి క్వార్టర్ చివరినాటికి ఎస్‌బీఐ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏ) 4.25 శాతానికి(రూ.56,725 కోట్లు) దిగొచ్చాయి. అంతక్రితం ఏడాది మార్చి చివరినాటికి ఈ నిష్పత్తి 4.95 శాతంగా(రూ.61,605 కోట్లు) ఉంది. నికర ఎన్‌పీఏలు 2.57 శాతం నుంచి 2.12 శాతానికి తగ్గాయి. కాగా, క్యూ4లో ఎన్‌పీఏలపై కేటాయింపులు(ప్రొవిజనింగ్) రూ.5,884 కోట్ల నుంచి రూ.4,635 కోట్లకు తగ్గాయి. ఇక కొత్తగా మొండిబకాయిలుగా మారిన రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,769 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఈ పరిమాణం రూ.7,947 కోట్లుగా ఉంది.
పూర్తి ఏడాదికి ఇలా...
2014-15 పూర్తి ఏడాదిలో ఎస్‌బీఐ స్టాండెలోన్ నికర లాభం రూ.13,102 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది రూ.10,892 కోట్లతో పోలిస్తే 20% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 13% వృద్ధితో 1,54,904 కోట్ల నుంచి రూ.1,74,972 కోట్లకు ఎగసింది. ఎస్‌బీఐ గ్రూప్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన(అనుబంధ సంస్థలతో కలిపి) నికర లాభం 2014-15 ఏడాదిలో 20% ఎగబాకి రూ.16,994 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది లాభం రూ.14,174 కోట్లు. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. రూ.2,26,944 కోట్ల నుంచి రూ.2,57,290 కోట్లకు పెరిగింది. 13.4% వృద్ధి చెందింది.
క్యూ4 ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 14 శాతం ఎగబాకి రూ.12,903 కోట్ల నుంచి రూ.14,712 కోట్లకు చేరింది. మార్చి క్వార్టర్ నాటికి నికర వడ్డీ మార్జిన్ 3.16 శాతంగా నమోదైంది.
బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 13.08 శాతం పెరిగి మార్చి చివరినాటికి రూ.15,76,793 కోట్లుగా నమోదయ్యాయి. ఇక మొత్తం రుణాలు 7.25 శాతం వృద్ధితో రూ.13,35,424 కోట్లను తాకాయి.
2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను వాటాదారులకు రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై ఎస్‌బీఐ రూ.3.5(350%) డివిడెండ్‌ను ప్రకటించింది.
రికవరీలపై మరింత దృష్టి...
క్యూ4లో స్థూల, నికర ఎన్‌పీఏలు రెండూ తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిల రికవరీపై మరింత దృష్టిసారిస్తున్నాం. రానున్న 10 నెలల్లో రూ.15,000 కోట్ల మేర నిధుల సమీకరణకు బ్యాంక్ అనుమతులు పొందింది. ఎస్‌బీఐ లైఫ్‌లో 10 శాతం వాటా విక్రయంపై దృష్టిపెట్టాం.
- అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చైర్‌పర్సన్
ఎగసిపడిన షేరు...
ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు భారీగా ఎగసిపడింది. మెరుగైన లాభాలు, మొండిబకాయిల తగ్గుదల ప్రభావంతో శుక్రవారం బీఎస్‌ఈలో బ్యాంక్ షేరు ధర ఒకానొక దశలో 5.4% ఎగసి రూ.305 గరిష్టస్థాయిని తాకింది. అయితే, పైస్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో చివరకు 2.38 శాతం దిగజారి రూ.282 వద్ద స్థిరపడింది.