ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు మొండిబకాయిలు షాక్ ఇచ్చాయి. 2018–19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్, క్యూ3) అత్యంత నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించింది. అనుబంధ సంస్థలన్నిటితో కలిపి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎస్‌బీఐ రూ.1,887 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.
క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఎస్‌బీఐ రూ.2,152 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం గమనార్హం. ప్రధానంగా అధిక మొండిబకాయిలతో కేటాయింపులు పెరిగిపోవడం, వడ్డీయేతర ఆదాయం పడిపోవడం వంటివి లాభాల్లోనుంచి నష్టాల్లోకి జారిపోవడానికి కారణమయ్యాయి. ఎస్‌బీఐ 17 ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా క్యూ3లో నికర నష్టాన్ని ప్రకటించడం మొండిబకాయిల తీవ్రతకు నిదర్శనం.
మార్కెట్ వర్గాలు ఎస్‌బీఐ క్యూ3లో రూ.2,507 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయొచ్చని అంచనా వేశాయి. కాగా, క్యూ3లో కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.74,191 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది క్యూ3లో ఆదాయం రూ.75,537 కోట్లతో పోలిస్తే 1.79 శాతం తగ్గింది. కాగా, కొత్త చైర్మన్ రజనీష్ కుమార్ హయాంలో తొలి ఆర్థిక ఫలితాలు ఇవే కావడం గమనార్హం.
స్టాండెలోన్ ప్రాతిపదికన చూస్తే...
ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే (స్టాండెలోన్ ప్రాతిపదికన) ఎస్‌బీఐ క్యూ3లో రూ.2,416 కోట్ల నికర నష్టాన్ని చవి చూసింది. క్రితం ఏడాది క్యూ3లో బ్యాంక్ స్టాండెలోన్‌గా రూ.2,610 కోట్ల నికర లాభాన్ని ఆర్జించటం గమనార్హం. మొత్తం ఆదాయం రూ.53,587 కోట్ల నుంచి రూ.62,887 కోట్లకు పెరిగింది. 17.3 శాతం వృద్ధి నమోదయింది.
మొండిబకాయిలు పైపైకి...
ఎస్‌బీఐ మొండిబకాయిలు (ఎన్‌పీఏ) క్యూ3లో భారీగా పెరిగాయి. బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల ఎన్‌పీఏలు 2017 డిసెంబర్ నాటికి (క్యూ3) 10.35 శాతానికి చేరి రూ.1,99,141 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది క్యూ3 చివరికి స్థూల ఎన్‌పీఏలు 7.23 శాతం (రూ.1,08,172 కోట్లు) మాత్రమే.
కాగా, ఈ ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే (9.83 శాతం) సీక్వెన్షియల్‌గా కూడా స్థూల ఎన్‌పీఏలు పెరగడం గమనార్హం. నికర ఎన్‌పీఏలు సైతం గతేడాది క్యూ3లో 4.24 శాతం (రూ.61,430 కోట్లు) నుంచి ఈ ఏడాది క్యూ3లో 5.61 శాతానికి (రూ.1,02,370 కోట్లు) ఎగబాకాయి. ఈ ఏడాది క్యూ2లో నికర ఎన్‌పీఏలు 5.43 శాతంగా ఉన్నాయి.
కేటాయింపులు 145 శాతం అప్...
మొండిబకాయిలకు కేటాయింపులు(ప్రొవిజనింగ్) డిసెంబర్ క్వార్టర్‌లో (క్యూ3) ఏకంగా 145 శాతం ఎగబాకి రూ.7,244 కోట్ల నుంచి రూ.17,760 కోట్లకు పెరిగాయి. క్యూ2లో ఈ పెరుగుదల 6.2 శాతం మాత్రమే. ఇందులో రూ.6,000 కోట్ల ప్రొవిజన్స్ పాతవాటికి సంబంధించి తాజాగా చేయడం వల్ల పెరిగినవే.
కాగా, క్యూ3లో కొత్తగా రూ.25,830 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారాయి. ఇందులో కార్పొరేట్ కంపెనీలకు చెందినవి రూ.21,823 కోట్లు (విద్యుత్ రంగం రూ.14,422 కోట్లు) ఉన్నాయి. కాగా, ఎన్‌పీఏగా మరే అవకాశం ఉన్న జాబితాలో (వాచ్‌లిస్ట్) రూ.10,834 కోట్ల రుణాలున్నాయి. దివాలా కేసుల్లో చిక్కుకున్న కంపెనీల మొండిబకాయిలకు (40 ఖాతాలకు చెందిన రూ.78,000 కోట్లు) సంబంధించి 60 శాతం మేర కేటాయింపులు చేసినట్లు బ్యాంక్ తెలిపింది.
క్యూ3 ఆర్థిక ఫలితాలు కచ్చితంగా నిరుత్సాహపరిచేవే. క్యూ4లో కూడా మొండిబకాయిలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు తప్పవు. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సానుకూల వాతావరణం ఉంటుందని భావిస్తున్నా. కాగా, ఆర్‌బీఐ మదింపులో బయటపడిన మొండిబకాయిల్లో 90 శాతాన్ని ఇప్పటికే ఎన్‌పీఏలుగా గుర్తించాం.
ఇందులో దాదాపు రూ.10,000 కోట్లు విద్యుత్ రంగానికి చెందినవే. రానున్న కాలంలో ఈ రంగానికి చెందిన రుణాల్లో మరిన్ని ఎన్‌పీఏలుగా మారే అవకాశాలున్నాయి. గడచిన 9 నెలల కాలంలో కొత్తగా మొండిబకాయిలుగా మారిన రుణాలు తగ్గుముఖం పట్టాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో(2018–19)లో వీటిని 2 శాతం లోపునకే పరిమితం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– రజనీష్ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్
ఎన్‌పీఏల్లో భారీ తేడాలు...
గడచిన ఆర్థిక సంవత్సరంలో (2016–17) ఎస్‌బీఐ భారీ మొత్తంలో ఎన్‌పీఏలను తక్కువగా చూపించినట్లు ఆర్‌బీఐ తనిఖీల్లో బయటపడింది. 2017 మార్చినాటికి ఎస్‌బీఐ స్థూల ఎన్‌పీఏలను రూ.1,12,342 కోట్లుగా ప్రకటించింది. అయితే, ఆర్‌బీఐ మదింపులో మాత్రం ఇవి రూ.1,35,582 కోట్లుగా లెక్కతేలాయి.
అదే విధంగా నికర ఎన్‌పీఏలు కూడా ఆర్‌బీఐ రూ.75,796 కోట్లుగా లెక్కతేల్చగా, ఎస్‌బీఐ మాత్రం రూ.58,277 కోట్లుగా చూపింది. ప్రొవిజనింగ్(కేటాయింపులు) కూడా రూ.5,720 కోట్ల మేర ఎస్‌బీఐ తగ్గించింది. వీటన్నింటినీ తాజాగా మొండిబకాయిలుగా చూపడంతోపాటు తగిన కేటాయింపులు కూడా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గతేడాది నికర లాభాన్ని తొలుత ప్రకటించిన రూ.10,484 కోట్ల నుంచి రూ.6,743 కోట్లకు సవరించడం విశేషం.
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
♦ క్యూ3లో నికర వడ్డీ ఆదాయం 5.17% వృద్ధితో రూ.18,688 కోట్లకు పెరిగింది.
♦ క్యూ3లో వడ్డీయేతర ఆదాయం 29.75 శాతం దిగజారి రూ.11,507 కోట్ల నుంచి రూ.8,084 కోట్లకు పడిపోయింది. ప్రధానంగా ట్రెజరీ కార్యకలాపాల్లో నష్టాలు(మార్క్–టు–మార్కెట్) దీనికి కారణంగా నిలిచాయి.
♦ ఫీజుల రూపంలో ఆదాయం 5.71 శాతం పెరుగుదలతో రూ.4,710 కోట్ల నుంచి రూ.4,979 కోట్లకు చేరింది.
♦ ఫీజులు కాకుండా ఇతర ఆదాయం మాత్రం 18.38 శాతం క్షీణించి రూ.14,401 కోట్ల నుంచి రూ.11,755 కోట్లకు దిగజారింది.
♦ క్యూ3లో రుణ వృద్ధి అత్యంత స్వల్పంగా 2.52 శాతం మాత్రమే నమోదైంది. దీంతో డిసెంబర్ చివరికి బ్యాంక్ మొత్తం రుణాల పరిమాణం రూ.19.24 లక్షల కోట్లకు చేరింది. రిటైల్ రుణాల్లో 13.59 శాతం, వ్యవసాయ రుణాల్లో 5.88 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. కార్పొరేట్ రుణాలు మాత్రం 4.22 శాతం తగ్గింది.
♦ ఇక బ్యాంక్ డిపాజిట్లు కూడా క్యూ3లో నామమాత్రంగా 1.86 శాతం వృద్ధితో రూ.26.51 లక్షల కోట్లకు చేరాయి.
♦ నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) 0.26 శాతం దిగజారి 2.45 శాతానికి చేరింది.
♦ శుక్రవారం బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు ధర 1.68 శాతం నష్టంతో రూ.296 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment