లాభం తగ్గింది షేరు ఎగసింది | SBI vaults after Q4 result | Sakshi
Sakshi News home page

లాభం తగ్గింది షేరు ఎగసింది

Published Sat, May 24 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

లాభం తగ్గింది షేరు ఎగసింది

లాభం తగ్గింది షేరు ఎగసింది

న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గతేడాది ఆఖరి త్రైమాసికం(2013-14, క్యూ4)లో స్టాండెలోన్ ప్రాతిపదికన రూ.3,041 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నమోదు చేసిన రూ.3,299 కోట్లతో పోలిస్తే లాభం 7.83 శాతం తగ్గింది. ప్రధానంగా మొండిబకాయిలపై ప్రొవిజనింగ్ కేటాయింపులు పెరగడం, రానున్న వేతన సవరణ కోసం కొంతమొత్తాన్ని పక్కనబెట్టడం వంటివి లాభాల తగ్గుదలకు దారితీసినట్లు బ్యాంక్ పేర్కొంది. ఇక క్యూ4లో మొత్తం ఆదాయం రూ.36,331 కోట్ల నుంచి రూ. 42,443 కోట్లకు ఎగబాకింది. 17 శాతం వృద్ధి చెందింది. కాగా, బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) జనవరి-మార్చి క్వార్టర్‌లో 16.4 శాతం వృద్ధితో రూ.12,903 కోట్లకు ఎగసింది.

 పెరిగిన మొండిబకాయిలు...
 బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏ) మార్చి క్వార్టర్ చివరికి 4.95 శాతానికి(రూ.61,605 కోట్లు) పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఈ పరిమాణం 4.75 శాతం(రూ.51,189 కోట్లు)గా ఉంది. అంటే 20.3 శాతం ఎగబాకాయి. నికర ఎన్‌పీఏలు కూడా 2.10 శాతం(రూ.21,956 కోట్లు) నుంచి 2.57 శాతానికి(రూ.31,096 కోట్లు) ఎగబాకాయి. ఏకంగా 41.6 శాతం అధికమయ్యాయి.

ఇదిలావుండగా..

2013-14 క్యూ4లో మొండిబకాయిలపై ప్రొవిజనింగ్ కేటాయింపులు రూ.5,884 కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.3,974 కోట్లు మాత్రమే. అంటే 40.05 శాతం పెరిగినట్లు లెక్క. ఇక 2013-14 పూర్తి ఏడాదికి బ్యాంక్ మొత్తం ప్రొవిజనింగ్ కేటాయింపులు రూ.7,587 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది రూ.4,461 కోట్లతో పోలిస్తే 70.06 శాతం పెరగడం గమనార్హం. కాగా, క్యూ4లో బ్యాంక్ రూ.1,397 కోట్ల బకాయిలను రికవరీ చేసుకోగా, రూ.1,148 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఇక క్యూ4లో తాజాగా రూ.13,766 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారాయి.

 పూర్తి ఏడాదికి ఇలా...
 2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 23 శాతం దిగజారి రూ.10,891 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాదిలో నికర లాభం రూ.14,105 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం మాత్రం రూ.1,19,655 కోట్ల నుంచి రూ.1,36,351 కోట్లకు పెరిగింది. 14 శాతం వృద్ధి నమోదైంది. ఇక కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కూడా బ్యాంక్ గతేడాది నికర లాభం 21 శాతం క్షీణించింది. రూ.17,916 కోట్ల నుంచి రూ.14,174 కోట్లకు తగ్గింది.

 ఇతర ముఖ్యాంశాలివీ...
 పూర్త ఏడాదికి బ్యాంక్ రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.30 చొప్పున(గతంలో ఇచ్చిన రూ.15 మధ్యంతర డివిడెండ్‌తో కలిపి) తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

 మార్చి చివరినాటికి నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) 3.17 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలాఖరుకు ఎన్‌ఐఎం 3.34 శాతంగా ఉంది.
 
 క్యూ4లో ఫీజుల రూపంలో ఆదాయం 15.34 శాతం వృద్ధితో రూ.4,467 కోట్లకు పెరిగింది. వడ్డీయేతర ఆదాయం 18.73 శాతం ఎగసి రూ.6,586 కోట్లకు చేరింది.


గతేడాది క్యాపిటల్ అడిక్వసీ రేషియో 12.44 శాతం కాగా, ఇందులో టైర్-1 క్యాపిటల్ 9.72 శాతంగా ఉంది.

మొత్తం వ్యాపారం(డిపాజిట్లు-రుణాలు) 2013-14లో రూ.26,39,531 కోట్లకు పెరిగింది. 2012-13లో రూ.22,81,297 కోట్లతో పోలిస్తే 3,58,234 కోట్లు ఎగసింది.

గడిచిన ఏడాది కాలంలో కొత్తగా 1,053 బ్రాంచ్‌లను ఎస్‌బీఐ  ఏర్పాట చేసింది. దీంతో మార్చినాటికి మొత్తం శాఖల సంఖ్య 15,869కి చేరింది.
 
 దూసుకెళ్లిన షేరు...
 ఫలితాలు విశ్లేషకుల అంచనాల కంటే మెరుగ్గా ఉండటంతో షేరు ధర దూసుకెళ్లింది. బ్రోకరేజి నిపుణులు క్యూ4లో బ్యాంక్ నికర లాభం రూ.2,824 కోట్లుగా అంచనావేశారు. అంతేకాకుండా క్యూ3తో పోలిస్తే క్యూ4లో(సీక్వెన్షియల్‌గా మొండిబకాయిలు మెరుగుపడటం కూడా మార్కెట్ వర్గాలను మెప్పించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర శుక్రవారం బీఎస్‌ఈలో ఒకానొకదశలో 10 శాతంపైగా ఎగబాకింది. రూ.2,775 గరిష్టాన్ని తాకింది. చివరకు 9.69 శాతం(రూ.243) లాభంతో రూ.2,755 వద్ద స్థిరపడింది.
 
 ఎగవేతదారుగా కింగ్‌ఫిషర్ విజయ్ మాల్యా!
 కావాలనే రుణాన్ని ఎగ్గొట్టిన ఎగవేతదారుగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటరు విజయ్ మాల్యా పేరును ప్రకటించడంపై ఎస్‌బీఐ దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమ వాదనలు పటిష్టంగా ఉండేలా వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్లు ఎస్‌బీఐ వర్గాలు తెలిపాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు నుంచి తీసుకున్న అప్పును రుణ గ్రహీత దారి మళ్లించారని, చె ల్లించే సామర్థ్యం ఉన్నా చెల్లించడం లేదని నిరూపించాల్సి ఉంటుంది.

ఈ రెండు విషయాలను రుజువు చేయగలిగితే.. మాల్యాను ఎగవేతదారుగా ప్రకటించడానికి వీలు చిక్కుతుందని ఎస్‌బీఐ వర్గాలు చెప్పాయి. మరోవైపు, మాల్యా వ్యక్తిగత ఆస్తులను కూడా జప్తు చేసుకునే విషయాన్ని బ్యాంక్ పరిశీలిస్తోన్నట్లు వివరించాయి. ఎగవేతదారుగా బ్యాంకు డిక్లేర్ చేసిన వ్యక్తి... వివిధ కంపెనీల్లో తనకున్న డెరైక్టర్ హోదాలను కోల్పోతారు. అలాగే, భవిష్యత్‌లో మళ్లీ రుణం తీసుకోవడానికి అవకాశం ఉండదు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఎస్‌బీఐ రూ. 1,600 కోట్ల మేర రుణం ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement