భారత్‌కు స్కానియా హై టెక్నాలజీ ట్రక్కులు
♦ ప్రీమియం విభాగంలోనే కొనసాగుతాం
♦ సాక్షితో కంపెనీ డైరెక్టర్ హనా జోహన్సన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ట్రక్ విపణిలో ప్రీమియం విభాగంలోనే కొనసాగుతామని స్కానియా కమర్షియల్ వెహికిల్స్ ఇండియా వెల్ల డించింది. ఈ విభాగంలో మొదటి రెండు స్థానాల్లోనే ఉంటామని కంపెనీ డైరెక్టర్ హనా జోహన్సన్ మంగళవారం తెలిపారు. పి–440 యూ–బాడీ టిప్పర్‌ను మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా సేల్స్ డైరెక్టర్ శ్రీనివాసన్ రాఘవన్‌తో కలిసి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో మాట్లాడారు. భారత మైనింగ్ రంగం కోసం ప్రత్యేకంగా పి–440 మోడల్‌ను డిజైన్ చేసినట్టు చెప్పారు. డిమాండ్‌నుబట్టి భవిష్యత్‌లో ఇతర మోడళ్లను దేశీ మార్కెట్ కోసం ప్రవేశపెడతామన్నారు.
ఇందుకోసం బెంగళూరులోని పరిశోధన, అభివృద్ధి కేంద్రం నిమగ్నమైందని చెప్పారు. భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్లకు అవసరమైన మోడళ్లను ఈ కేంద్రం డిజైన్ చేస్తుందని పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాల విషయంలో ఎటువంటి రాజీ లేదని స్పష్టం చేశారు. స్కానియా అంతర్జాతీయంగా అందుబాటులోకి తెచ్చిన హై టెక్నాలజీ వాహనాలను ఇక్కడా పరిచయం చేస్తున్నట్టు వివరించారు. భవిష్యత్ మార్కెట్లలో భారత్ ఒకటని గుర్తు చేశారు. తక్కువ వ్యయంతో ఉత్తమ పనితీరు కనబరిచే వాహనాలనే విక్రయిస్తామని తెలిపారు. కాగా, ప్రతి వాహనాన్ని కస్టమర్ అవసరాన్నిబట్టి డిజైన్ చేస్తారు. భారత్‌లో ఏటా 2,500 ట్రక్కులు, 1,000 బస్సుల తయారీ సామర్థ్యం గల రెండు ప్లాంట్లు కంపెనీకి ఉన్నాయి.