వరదనీటిలోకి దూసుకెళ్లిన టిప్పర్
తాటి చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్న డ్రైవర్
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): తెలంగాణ నుంచి ఒడిశా వెళుతోన్న టిప్పర్ వరదనీటిలో చిక్కుకోగా డ్రైవర్ రాత్రంతా చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో జరిగింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన మర్రి నవీన్ తెలంగాణలోని సత్తుపల్లికి చెందిన టిప్పర్‌ను ఒడిశాలో అప్పగించేందుకు ఆదివారం బయలుదేరాడు.
గూగుల్ మ్యాప్ సాయంతో టిప్పర్‌ను నడుపుతున్న నవీన్ అర్ధరాత్రి చింతూరు మండలం నిమ్మలగూడెంకు చేరుకున్నాడు. అప్పటికే ఒడిశాకు వెళ్లే జాతీయ రహదారి–326పై భారీగా వరదనీరు నిలిచి ఉంది. ఈ విషయాన్ని గమనించని నవీన్ వేగంగా టిప్పర్‌ను నీటిలోకి దింపడంతో అది దూసుకుపోయి వరద నీటిలో చిక్కుకుంది.
దీంతో భయపడిన అతను లారీ క్యాబిన్‌పైకి ఎక్కగా వరదనీరు క్రమేపీ క్యాబిన్ పైకి కూడా రావడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు పక్కనే ఉన్న తాటిచెట్టు ఎక్కాడు. రాత్రంతా అతను చెట్టుపైనే బిక్కుబిక్కుమంటూ గడపగా ఉదయం అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని పడవ సాయంతో డ్రైవర్‌ను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment