
న్యూఢిల్లీ: లిస్టైన కంపెనీల సీఎమ్‌డీ (చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్) పదవి విభజన గడువును మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ మరో రెండేళ్లు పొడిగించింది. ఈ మేరకు కంపెనీల నుంచి వచ్చిన వినతులను సెబీ మన్నించింది. సెబీ నిబంధనల ప్రకారం, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అగ్రశ్రేణి 500 లిస్టెడ్ కంపెనీలు సీఎమ్‌డీ పదవిని చైర్మన్‌గా, ఎమ్‌డీగా విభజించాల్సి ఉంది. దీనికి గడువును ఈ ఏడాది ఏప్రిల్ 1గా నిర్ణయించింది. లిస్టెడ్ కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరుగుపరచడం లక్ష్యంగా, కోటక్ కమిటీ సూచనల మేరకు సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ గడువును మరో రెండేళ్లపాటు పొడిగించాలని తాజాగా సెబీ నిర్ణయించింది. గడువు పొడిగింపునకు సంబంధించిన కారణాలను సెబీ వెల్లడించలేదు. అయితే ప్రస్తుత ఆర్థిక మందగమన కాలంలో సీఎమ్‌డీ పదవిని రెండుగా విభజించడం ఒకింత భారంతో కూడుకున్నదని, ఈ గడువును పొడిగించాలని పలు కంపెనీలు విన్నవించడంతో సెబీ గడువును పొడిగించిందని సమాచారం. ప్రస్తుతం టాప్ 500 లిస్టెడ్ కంపెనీల్లో సగం మాత్రమే సీఎమ్‌డీ పదవిని రెండుగా విభజించాయని స్టాక్ ఎక్సే్చంజ్‌ల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పలు కంపెనీలు ఈ రెండు పదవులను కలిపేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, విప్రో, హీరో మోటోకార్ప్, తదితర కంపెనీల్లో ఈ రెండు బాధ్యతలను ఒక్క వ్యక్తే నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment