![SEBI realaxed preferential allotment rules - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/18/SEBI.jpg.webp?itok=VSzCjgAS)
కోవిడ్-19 కారణంగా నీరసిస్తున్న స్టాక్ మార్కెట్లు, కార్పొరేట్లకు దన్నుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ నిబంధనలు సవరించింది. తద్వారా ప్రమోటర్లు తమ వాటాను పెంచుకునేందుకు వీలు కల్పించడంతోపాటు.. కంపెనీలకు అదనపు నిధులు సమకూరేందుకు దారి ఏర్పాటుకానుంది. సెబీ నిర్ణయాలు మార్కెట్లకు దన్నునిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..
వచ్చే మార్చివరకూ
వచ్చే ఏడాది(2021) మార్చివరకూ అమలులో ఉండే విధంగా సెబీ ప్రిఫరెన్షియల్ కేటాయింపుల నిబంధనలను సరళీకరించింది. దీంతో కంపెనీల ప్రమోటర్లు ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా 10 శాతం వరకూ వాటాను పెంచుకునేందుకు వీలుంటుంది. ఇప్పటివరకూ 5 శాతం వాటా పెంపునకు మాత్రమే నిబంధనలు అనుమతిస్తున్నాయి. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డవున్ కారణంగా పలు కంపెనీలకు నిధుల ఆవశ్యకత ఏర్పడింది. దాదాపు మూడు నెలలుగా అమ్మకాలు క్షీణించడంతో కార్యకలాపాల నిర్వహణకు అదనపు నిధుల అవసరం ఏర్పడుతున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి.
ఓపెన్ ఆఫర్‌కు నో
సవరించిన నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకూ ఈక్విటీ వాటాను ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా పొందవచ్చు. అయినప్పటికీ పబ్లిక్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించవలసిన అవసరం ఉండదు. ఇప్పటివరకూ 5 శాతంవరకే ఈ పరిమితి అమలవుతోంది. ఫలితంగా అటు ప్రమోటర్లు తమ వాటాను పెంచుకునేందుకు వీలు చిక్కడంతోపాటు.. కంపెనీలకు అదనపు నిధులు లభించనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఎఫ్‌వో శాలిభద్ర షా పేర్కొన్నారు. ప్రమోటర్లకు ఈక్విటీగా మార్పిడికి వీలయ్యే సెక్యూరిటీల జారీ ద్వారా కంపెనీలు వేగంగా నిధులు సమకూర్చుకునేందుకు వీలుంటుందని తెలియజేశారు. సెబీ తాజా నిర్ణయం ద్వారా ప్రమోటర్లు బోర్డులో మరింత మంది వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించేందుకు మార్గమేర్పడుతుందని జిరోధా సీఐవో నిఖిల్ కామత్ పేర్కొన్నారు.
మార్కెట్లకు ప్లస్
విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), దేశీ ఫండ్స్(డీఐఐలు)తో పోలిస్తే ప్రమోటర్లు దీర్ఘకాలిక ఇన్వెస్టర్లుగా నిలుస్తారు గనుక లిస్టెడ్ కంపెనీలకు మరింత బలమొస్తుందని విశ్లేషకులు వివరించారు. ఇది అంతిమంగా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ తెలియజేశారు. ప్రమోటర్ నిధుల ద్వారా కంపెనీలకు నిలకడ లభిస్తుందని, ఇది ఇన్వెస్టర్లలోనూ విశ్వాసాన్ని పెంచుతుందని శామ్‌కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment